జగ్గంపేట, రంగవల్లి నగర్, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 5,
జిల్లాలో సహకార పరపతి సంఘాల జరుగుతున్న అవినీతి అక్రమాలకు కూటమి పాలకులే నైతిక బాధ్యత వహించాలని శనివారం నాడు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామపంచాయతీ రంగవల్లి నగర్ లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ రాజపూడి, గండేపల్లి, కిర్లంపూడి తదితర సంఘాల్లో నేటి వరకు సుమారు 150 కోట్ల అవినీతి జరిగిన బాధ్యులను శిక్షించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక జిల్లాలో, రాష్ట్రంలో ప్రతి వ్యవస్థలో దోపిడీ చేస్తూ వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. అలాగే జిల్లాలో ఎక్కడ చూసినా పోలవరం కాలువ, కొండలు, గుట్టలను వదలకుండా మైనింగ్ మాఫియా అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తూ కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని, ఈ విషయంపై అనేకమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కనీసం స్పందించకపోవడం చూస్తుంటే జిల్లా యంత్రాంగం కూడా మామూళ్లమత్తులోమునిగిపోయిందనితేటతెల్లమవుతుందని ఆయన తెలిపారు. కావున రాజపూడి, గండేపల్లి సహకార సంఘాల్లో జరిగిన అవినీతి పై తక్షణమే న్యాయ విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించే విధంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో రంగవల్లి నగర్ నాయకులు డాన్ శీను , కొండేపూడి మంగయమ్మ, కరుణ తదితరులు పాల్గొన్నారు.


