ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావ్ పై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారం కోల్పోయిన నిరాశతోనే కేటీఆర్ ప్రజలను అసత్యాలు, అబద్ధాలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇచ్చారో చెప్పలేని పరిస్థితిలో ఉన్న కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని విమర్శించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో లక్షలాది పేద కుటుంబాల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తోందని అన్నారు.
కాళేశ్వరం, కార్ రేస్, గొర్రెల పంపిణీ, విద్యుత్ కొనుగోళ్లు, ధరణి వంటి అంశాల్లో భారీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే ఉపయోగించుకున్నారని, పదేళ్ల పాలనలో గిరిజన తండాలకు తగిన స్థాయిలో గృహాలు నిర్మించలేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన ప్రాంతాలున్న నియోజకవర్గాలకు తొలి విడతగా 3,500 ఇందిరమ్మ ఇళ్లు, అదనంగా 1,500 ఇళ్లను కేటాయించి గిరిజన గూడాల్లోని గుడిసెలను పక్కా ఇళ్లుగా మారుస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పదేళ్లలో నిర్మించిన ఇళ్ల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే ఎక్కువ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిందని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల అంశంపై తాను విసిరిన సవాల్‌ను మరోసారి గుర్తు చేస్తూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పదేళ్లలో నిర్మించిన ఇళ్ల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లు నిర్మిస్తేనే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని మంత్రి పొంగులేటి ప్రకటించారు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లు నిర్మిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయనని కేటీఆర్ ప్రకటించగలరా అని సవాల్ విసిరారు.
ప్రజలకు మేలు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వమే చేపడుతోందని, ఆ విషయాన్ని కేటీఆర్ కూడా తెలుసు కాబట్టే తన సవాల్‌ను స్వీకరించేందుకు ముందుకు రావడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.



