వీఆర్ఏల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వీఆర్ఏ అసోసియేషన్ రాష్ట్ర నేత కొమ్మది ఈశ్వరయ్య బహిరంగ లేఖ
కడప ఆగస్టు 18 (పున్నమి న్యూస్)
రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలపై ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని ఏపీ వీఆర్ఏ వెల్ఫేర్ అండ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కొమ్మద్ది ఈశ్వరయ్య ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం వీరపునాయునిపల్లెలో ఆయన డిమాండ్లతో కూడిన బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల మంది వీఆర్ఏలు గ్రామస్థాయిలో సేవలందిస్తున్నారని, వారికి ప్రస్తుతం రూ.10,500 గౌరవ వేతనం మాత్రమే అందుతోందన్నారు. పని భారం అధికంగా ఉన్నప్పటికీ వేతనం తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
వీఆర్ఏలకు పే స్కేల్ వర్తింపజేయాలని, వన్టైమ్ సెటిల్మెంట్ కింద అర్హత కలిగిన వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని, నామిని వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యలపై చర్చించి, వీఆర్ఏలకు న్యాయం జరిగేలా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కడప జిల్లా అధ్యక్షులు కోడూరు పుల్లయ్య, ఏపీ డైరెక్ట్ వీఆర్ఏ రిక్రూట్మెంట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెంకటసుబ్బయ్య, కేశవ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
