ఫార్మా సిటీ బాధిత రైతుల కోసం పోరాటం కొనసాగిస్తున్న సమితి
“రైతుల హక్కుల కోసం చివరి వరకు పోరాటం”
పున్నమి న్యూస్
27 మే 2026
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో ఫార్మా సిటీ మరియు ఫోర్త్ సిటీ భూసేకరణ అంశంపై రైతుల తరఫున పోరాటం చేస్తున్న “ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట సమితి” మరోసారి తమ స్వరాన్ని బలంగా వినిపించింది.
2016లో ముచ్చర్ల ప్రాంతంలో ప్రారంభమైన ఫార్మా సిటీ ప్రాజెక్ట్ మొదట అసైన్డ్ భూములకే పరిమితం అవుతుందని అధికారులు ప్రకటించినప్పటికీ, అనంతరం పట్టా భూములను కూడా భూసేకరణలో చేర్చినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ముచ్చర్ల నుంచి కూర్మిద్దా, తండాలు, మీర్ఖాన్‌పేట్, తాడిపర్తి, నానక్‌నగర్, మేడిపల్లి ప్రాంతాలకు ప్రాజెక్ట్ విస్తరించడంతో రైతుల్లో ఆందోళన పెరిగింది.
అప్పట్లో గ్రామాలకు ప్రత్యేకంగా అధికారులను నియమించి రైతులపై ఒత్తిడి తీసుకువచ్చి భూములు తీసుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు, ప్రజాప్రతినిధులు, పర్యావరణ పరిరక్షణ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు మరియు కవుల సరస్వతి ఆధ్వర్యంలో “ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట సమితి” ఏర్పడింది.
ఈ సమితి నిరంతర పోరాట ఫలితంగానే పట్టా భూముల పరిహారం రూ.12.50 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు పెరిగిందని, ప్రతి ఎకరానికి 121 గజాల ప్లాటు హామీ సాధ్యమైందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కూడా ఎకరానికి రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు పరిహారం పెంపు కోసం సమితి పోరాటం కొనసాగిస్తోందని పేర్కొన్నారు.
అదేవిధంగా ఇప్పటికే హామీ ఇచ్చిన ప్రతి ఎకరానికి 121 గజాల ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి రైతులకు దస్తావేజులు అందించే వరకు తమ ఉద్యమం ఆగదని సమితి సభ్యులు స్పష్టం చేశారు. ఇప్పటికీ పరిహారం అందని రైతుల కోసం ఎంత దూరమైనా పోరాటం చేస్తామని హెచ్చరించారు.
2013 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కూడా సమితి సభ్యులు ప్రశ్నిస్తున్నారు. గ్రామ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, అధికార పార్టీ రైతుల సమస్యలను పరిష్కరిస్తుందనే నమ్మకంతో ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
“రైతుల హక్కుల సాధన కోసం ఐక్య పోరాటమే మార్గం”
జై ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట సమితి
వర్ధిల్లాలి రైతు ఐక్యత – వర్ధిల్లాలి పోరాట స్పూర్తి



