ఆలయాల అభివృద్ధి, భక్తుల విశ్వాస పునరుద్ధరణే ప్రభుత్వ లక్ష్యం
అమరావతి /ఆత్మకూరు, జూన్ 22 ( పున్నమి ప్రతినిధి): రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో సమూల మార్పులు తీసుకువచ్చామని, ఆంధ్రప్రదేశ్‌ను నూతన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.సోమవారం సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి మీడియా సమావేశంలో మంత్రి శాఖాపరమైన రెండేళ్ల ప్రగతి నివేదికను విడుదల చేశారు. ఆలయాల అభివృద్ధి, భూముల పరిరక్షణ, అర్చకులు, వేద పండితుల సంక్షేమం, ఉద్యోగాల భర్తీ, రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై వివరాలను వెల్లడించారు.
గత ప్రభుత్వం హయాంలో దేవాదాయ శాఖలో అనేక లోపాలు చోటుచేసుకున్నాయని మంత్రి ఆరోపించారు. ఆలయాల పరిపాలనను గాడిలో పెట్టి భక్తుల విశ్వాసాన్ని తిరిగి పెంపొందించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు.తన రాజకీయ జీవితంలో తొలిసారిగా దేవాలయాల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఇదేనని మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో దేవాదాయ శాఖకు సంబంధించి ఇచ్చిన హామీల్లో ఎక్కువ భాగాన్ని జీవోల ద్వారా అమలు చేశామని తెలిపారు.
చిన్న ఆలయాలు, వేద పండితులకు ప్రాధాన్యత
రూ.50 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న చిన్న ఆలయాలకు ధూపదీప నైవేద్యాల నిధులను పెంచామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఆలయాల అర్చకులకు ప్రతి నెలా నేరుగా నగదు జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వేద పండితుల గౌరవ వేతనాన్ని పెంచి వారికి మరింత ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు.
ఆలయ భూముల సంరక్షణకు చర్యలు
దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు చెందిన భూములు, ఆస్తుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఆలయ భద్రత కోసం పోలీసు శాఖతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.ఆలయాల పూజా విధానాలు, ఆగమ సంప్రదాయాల్లో అధికారుల జోక్యం తగ్గించి, వైదిక సిబ్బందికి ప్రాధాన్యత కల్పించామని తెలిపారు.
2027 గోదావరి పుష్కరాలకు సన్నాహాలు
2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పుష్కరాల ఏర్పాట్ల కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామని, ఘాట్ల నిర్మాణం, పారిశుధ్యం, భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ఆలయాల పునర్నిర్మాణ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
టీటీడీలో ఆధునిక సాంకేతిక వినియోగం
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలను ప్రవేశపెట్టి భక్తుల రద్దీ, భద్రత, పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచామని మంత్రి తెలిపారు.ఆలయాలను కేవలం ప్రార్థనా స్థలాలుగా కాకుండా సామాజిక, సాంస్కృతిక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


