అనంతగిరి మండలంలోని మారుమూల గిరిజన గ్రామాల రవాణా కష్టాలకు త్వరలోనే పరిష్కారం లభించనుంది. ఏళ్ల తరబడి సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మడ్రెబు, తునిషిబు గ్రామాల ప్రజలకు ఊరట కలిగించేలా రహదారి నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ పరిధిలోని మడ్రెబు నుంచి తునిషిబు వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణ పనులు PMGSY పథకం కింద చేపట్టారు. ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతుండటంతో గ్రామస్తుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ఇప్పటివరకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో మడ్రెబు, తునిషిబు గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల గిరిజన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రహదారులు అధ్వానంగా మారడంతో అత్యవసర వైద్యం, విద్య, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, నిత్యావసర సరుకుల కోసం ప్రజలు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చేది.
రహదారి పూర్తయితే తగ్గనున్న దూరం
మడ్రెబు–తునిషిబు రహదారి నిర్మాణం పూర్తయితే అనంతగిరి మండలంలోని పలు గ్రామాలతో పాటు హుకుంపేట మండలంలోని గ్రామాలకు కూడా రవాణా సౌకర్యం మరింత సులభతరం కానుంది. ప్రస్తుతం మారుమూల ప్రాంతాలుగా ఉన్న ఈ గ్రామాలకు రహదారి అనుసంధానం మెరుగుపడటంతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయి.
వ్యవసాయంపై ఆధారపడే గిరిజన కుటుంబాలకు తమ పంటలు, కాఫీ తదితర ఉత్పత్తులను మార్కెట్కు తరలించేందుకు కూడా ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా మారనుంది. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు, అనారోగ్యంతో ఉన్నవారు ఆసుపత్రులకు చేరుకునేందుకు ఈ రహదారి కీలకంగా నిలవనుంది.



