ప్రజా సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు నేటి నుంచి ప్రతి సోమవారం మండల స్థాయిలో ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు అన్ని మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలు, వినతులను సంబంధిత అధికారులకు నేరుగా అందజేసి పరిష్కారం పొందవచ్చన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జిల్లా కేంద్రానికి రావాల్సిన శ్రమ, సమయం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. మండల స్థాయిలో అందే ప్రతి ఫిర్యాదును అధికారులు పరిశీలించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.



