సత్తుపల్లి, జూలై
(పున్నమి న్యూస్ జిల్లా రిపోర్టర్ /పువ్వాడ నాగేంద్ర కుమార్ )
బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ భూముల కొనుగోలు, కేటాయింపులో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవినీతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ శనివారం సత్తుపల్లి నియోజకవర్గ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో సత్తుపల్లి రింగ్ సెంటర్లో నిర్వహించాల్సిన ధర్నా కార్యక్రమానికి పోలీసులు అడ్డుకట్ట వేశారు.
ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలకు చెందిన బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పెనుబల్లి మండలం వి.ఎం. బంజర్ వద్ద పోలీసులు నిర్వహించిన ఈ చర్యలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈవి రమేష్, జిల్లా అధికార ప్రతినిధి పడిగల మధుసూదన్ రావు, పెనుబల్లి మండల పార్టీ అధ్యక్షులు బొర్ర నరసింహారావుతో పాటు పలువురు పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు.
బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూముల వ్యవహారంలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ప్రజల ముందు వాస్తవాలు వెల్లడించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు విమర్శించారు.

