బిక్కవోలు, సెప్టెంబర్ 18 (పున్నమి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామ పంచాయతీ కళ్యాణ మండపంలో ‘ఒక నెల–ఒక నియోజకవర్గం’ కార్యక్రమంలో భాగంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక–ప్రజా దర్బార్ (PGRS) నిర్వహించారు. కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్, అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రజల సమస్యలను గుర్తించి సత్వర పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. బిక్కవోలు మండలంలో ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చినట్లు చెప్పారు. ముఖ్యంగా 22ఏ భూములు, భూముల విస్తీర్ణంలో వ్యత్యాసాలు, సివిల్ వివాదాలకు సంబంధించిన అర్జీలు అందినట్లు తెలిపారు.
అర్జీలను పరిశీలించి తహసీల్దార్, ఆర్డీఓ, జేసీ స్థాయిల్లో పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల లాగిన్‌లలో నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరిష్కారం కావాల్సిన సమస్యలను అధికారులు ప్రత్యేకంగా పరిశీలించాలని ఆదేశించినట్లు చెప్పారు.
వచ్చే వారం రంగంపేట మండలంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు, ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.





