ఖమ్మం జులై
(పున్నమి న్యూస్ జిల్లా రిపోర్టర్ /పువ్వాడ నాగేంద్ర కుమార్ )
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీజేవైఎం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు అనంతు ఉపేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అనంతు ఉపేందర్ గౌడ్ మాట్లాడుతూ, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ గొప్ప దేశభక్తుడు, విద్యావేత్త, దూరదృష్టి కలిగిన నాయకుడని కొనియాడారు. కేవలం 33 ఏళ్ల వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టి విద్యారంగంలో విశేష సేవలు అందించారని గుర్తుచేశారు.
జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ “ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహీ చలేం గే” అనే నినాదంతో దేశ సమగ్రత కోసం పోరాడారని తెలిపారు. పర్మిట్ లేకుండానే కాశ్మీర్‌లోకి ప్రవేశించి అరెస్టయ్యారని, అనంతరం జైలులోనే అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం దేశ చరిత్రలో విషాదకర ఘట్టమని అన్నారు.
మంత్రి పదవికి రాజీనామా చేసి 1951లో భారతీయ జనసంఘ్‌ను స్థాపించిన డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలే నేటి భారతీయ జనతా పార్టీకి పునాదులని పేర్కొన్నారు. దేశ సమగ్రత, జాతీయ ఐక్యత కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు భవనాసి దుర్గారావు, మండల ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన గోవిందరావు, ఉపాధ్యక్షులు పురాణం దివాకర్, కొండా హర్షవర్ధన్, మండల నాయకులు సూరెపల్లి జ్ఞానరత్నం, షేక్ షర్ఫుద్దీన్, సయ్యద్ మోహినూద్దీన్, గెల్లా చక్రపాణి, ఎలిగేటి గిరి, పుట్టా సత్యనారాయణ, పిట్టల సూరిబాబు, తేజవత్ నాగరాజు, కాళంగి వెంకటేశ్వర్లు, గెల్లా నాగసాయి, బానోత్ శ్రీనివాసరావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.



