రైతు బాంధవుడిగా దర్శనమిస్తున్న ‘బొజ్జ గణపయ్య’
నందలూరు: నందలూరు మండల కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో డీజే గణేష్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినూత్నమైన విఘ్నేశ్వరుని ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.ఉమ్మడి కడప జిల్లాలోనే మునుపెన్నడూ లేని విధంగా, బొజ్జ గణపయ్య ఎద్దుల బండి తోలుతున్న రైతు రూపంలో దర్శనమివ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రైతు బాంధవుడిగా, నేల వైపు కరుణతో చూస్తూ భక్తులను అనుగ్రహిస్తున్న స్వామివారి రూపాన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, కడప సీమలో కష్టాలు తొలగి, సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతుల పంటలు బాగా పండాలనే సంకల్పంతో గణనాథుడిని రైతు రూపంలో ప్రతిష్ఠించినట్లు తెలిపారు.పండుగ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. స్థానిక భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.వినూత్నంగా ఎద్దుల బండి తోలుతున్న గణపతి విగ్రహంతో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు, యువకులు పోటీ పడ్డారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.



