తాటిపర్తిలో భూసేకరణపై ప్రజా అభిప్రాయ సేకరణ సభ
“మాకు మా భూములే కావాలి.. ఫార్మా సిటీ వద్దు, ఫ్యూచర్ సిటీ వద్దు” అంటూ రైతుల ముక్తకంఠ నినాదం
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తాటిపర్తి గ్రామంలో ఈ రోజు టీపీజేఏసీ (TPJAC) ఆధ్వర్యంలో ఫార్మా సిటీ – ఫ్యూచర్ సిటీ భూసేకరణ సమస్యలపై ప్రజా అభిప్రాయ సేకరణ సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ సభకు జ్యూరీ సభ్యులుగా సీనియర్ అడ్వకేట్ వి. రఘునాథ్, మానవ హక్కుల వేదిక జాతీయ కమిటీ సభ్యులు ఎస్. జీవన్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ వి. వసంత లక్ష్మి, సాతావాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సుజాత సురేపల్లి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయ్, రిటైర్డ్ తహసీల్దార్ వి. బాలరాజ్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమాన్ని టీపీజేఏసీ కో-కన్వీనర్ కన్నెగంటి రవి నిర్వహించారు. సభలో నాలుగు గ్రామాలకు చెందిన రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని భూసేకరణ పేరుతో జరుగుతున్న అక్రమాలు, అధికారుల దౌర్జన్యాలు, రైతులపై పడుతున్న ఇబ్బందులను జ్యూరీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు.
“మాకు పరిహారం కాదు.. మా భూములే కావాలి. ఫార్మా సిటీ వద్దు, ఫ్యూచర్ సిటీ వద్దు” అంటూ రైతులు, మహిళలు, కూలీలు ముక్తకంఠంతో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భూమి తమ జీవనాధారమని, భూములు కోల్పోతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
జ్యూరీ సభ్యులు మాట్లాడుతూ, ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలు, భూసేకరణలో జరిగిన అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిస్తామని, ప్రజల గొంతుకను రాష్ట్రవ్యాప్తంగా వినిపించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నాలుగు గ్రామాల సర్పంచులు నీలం శ్రీవిద్య, నీలం ఝాన్సీ, సంగం చైతన్యతో పాటు ఫార్మా వ్యతిరేక కమిటీ సభ్యులు కానేమోని గణేష్, సందీప్ రెడ్డి, కొండల్ రెడ్డి, సమ నిరంజన్, అచ్చిరెడ్డి, కుందారపు నారాయణ, చెన్నయ్య, దేవోజీ, వినోద్ రెడ్డి, సోమయ్య, అనంత్ రెడ్డి మరియు నాలుగు గ్రామాలకు చెందిన రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









