తేదీ: 22-08-2026 | పున్నమి రిపోర్టర్
ఆసిఫాబాద్: కైరిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లగూడలో శ్రీ సేవాలాల్ జగదాంబ మాత మందిరం వద్ద డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్ (DMFT) నిధులతో నూతన షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.3 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ నిర్మాణ పనులకు ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అజ్మీర ఆత్మారామ్ నాయక్, కైరిగూడ సర్పంచ్ సంధ్యారాణి కలిసి భూమిపూజ నిర్వహించి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులకు, గ్రామస్థులకు సౌకర్యంగా ఉండేలా షెడ్డు నిర్మాణం చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. డీఎంఎఫ్‌టీ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శంకర్, సునీత, జరుపుల శివాజీ, బానోత్ వసంతరావు, బానోత్ వినోద్, కున్సోత్ రమేష్, బలిరాం, ప్రభు, కాంట్రాక్టర్ పంబాల శీను తదితరులు పాల్గొన్నారు.



