ఖమ్మం జులై 3
(పున్నమి న్యూస్ / పువ్వాడ నాగేంద్ర కుమార్, జిల్లా రిపోర్టర్ )
ఆన్లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పేరుతో అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.15 లక్షలు మోసం చేసిన కేసులో ఓ మహిళను ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి వాట్సాప్ ద్వారా పరిచయమైన నిందితులు, “ఎనమ్ అసెట్ మేనేజ్మెంట్ పోర్ట్‌ఫోలియో లిమిటెడ్” కంపెనీలో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. అనంతరం ట్రేడింగ్ లింకులు పంపించి బాధితుడితో సుమారు రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసానికి పాల్పడ్డారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా కేరళలోని త్రివేండ్రానికి చెందిన అడ్వకేట్ ఆర్యదాస్ శైలజ (34)ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె బ్యాంకు ఖాతా ద్వారా రూ.2 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించడంతో పాటు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నమోదైన 38 సైబర్ నేర కేసులతో సంబంధం ఉన్నట్లు, ఆ ఖాతా ద్వారా సుమారు రూ.3 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితురాలిని ట్రాన్సిట్ వారెంట్‌పై ఖమ్మంకు తీసుకొచ్చి సైబర్ క్రైమ్ కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది.
ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణీందర్, ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సైలు రంజిత్ కుమార్, విజయ్ కుమార్‌తో పాటు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

