*సేవా సంకల్ప కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ క్యాంప్*
*క్యాంప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17, 2026 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌ను పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆసుపత్రికి వచ్చే రోగుల సమస్యలను సానుభూతితో తెలుసుకుని మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. రోగుల పట్ల నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఆసుపత్రి అభివృద్ధికి తన సహకారం అందిస్తానని తెలిపారు.
ఏప్రిల్ నుంచి జూన్ వరకు 378 ఆపరేషన్లు నిర్వహించిన ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. ఆసుపత్రికి అవసరమైన మౌలిక సదుపాయాలను సీఎస్ఆర్ నిధులతో త్వరలో సమకూర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ప్రజాసేవా భావంతో పనిచేయడం అందరికీ స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.
కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.


