కొత్తగూడెం జనవరి
(పున్నమి దినపత్రిక జిల్లా ప్రతినిధి)
కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి గారు ఆదివారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ అధికారులతో పాటు భాగస్వామ్య పక్షాల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించి, సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై వివరంగా చర్చించారు.
సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తిని పెంచడమే కాకుండా నాణ్యతను మెరుగుపరచడం ద్వారా సింగరేణి సంస్థను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. నాణ్యమైన ఉత్పత్తి ద్వారా సంస్థ ఆర్థికంగా బలపడడమే కాకుండా, దేశంలో ‘ఆత్మనిర్భర భారత్’ లక్ష్య సాధనకు సింగరేణి కీలక పాత్ర పోషించాలన్నారు.
వచ్చే మూడేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బొగ్గు రంగంతో పాటు దేశంలోని వివిధ రంగాల్లో విస్తృత సంస్కరణలు అమలుకానున్నాయని తెలిపారు. ఈ సంస్కరణలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయడానికి అధికారులు, ఉద్యోగులు, భాగస్వామ్య పక్షాలు అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
సింగరేణి సంస్థ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ సమావేశం సింగరేణి భవిష్యత్ దిశను నిర్దేశించే కీలక ఘట్టంగా మారిందని అధికారులు అభిప్రాయపడ్డారు.


