సత్తుపల్లి/ఖమ్మం
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సత్తుపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. కేటీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ నుంచి బోసుబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రూ.50 వేలతో ప్రారంభమైన సాయం రూ.1,00,116కు పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం లబ్ధిదారులు ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. రైతు బీమా ప్రీమియాన్ని సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం కొనసాగితే మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సండ్ర హెచ్చరించారు.



