ఎమ్మెల్యే నల్లమిల్లి చొరవ.. ఎంపీ పురంధేశ్వరి కృషితో సమస్యకు పరిష్కారం
సుమారు 50 వేల మంది తెలుగు రైతులకు భారీ ఊరట
అనపర్తి, ఆగస్టు 29 (పున్నమి ప్రతినిధి): ఒడిశా రాష్ట్రంలో వరి సాగు చేస్తున్న తెలుగు రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం కొనుగోలు సమస్యకు పరిష్కారం లభించింది. తెలుగు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఒడిశా ప్రభుత్వం అంగీకరించడంతో సుమారు 50 వేల మంది రైతులకు ఊరట లభించనుంది.
ఇటీవల పెదపూడి మండలానికి చెందిన పలువురు రైతులు తమ సమస్యను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఒడిశాలో తాము సాగు చేస్తున్న వరి ధాన్యాన్ని అక్కడి ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు.
రైతుల సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరిని కలిసి సమస్యను వివరించారు. దీనిపై స్పందించిన ఎంపీ పురంధేశ్వరి ఒడిశా వ్యవసాయ శాఖ మంత్రి, ఇతర సంబంధిత మంత్రులతో ఫోన్లో మాట్లాడి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
దీంతో ఒడిశా ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు అంగీకరించినట్లు ఎమ్మెల్యే నల్లమిల్లి తెలిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎంపీ పురంధేశ్వరికి, ఒడిశా ప్రభుత్వానికి, గవర్నర్ కంభంపాటి హరిబాబుకు, మంత్రులు పృథ్వీరాజ్ హరిచందన్, కృష్ణ చంద్ర పాత్ర, కనక్ వర్ధన్ సింగ్ డియోలకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


