ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ – ఏపీ జేఏసీ అమరావతి కృతజ్ఞతలు
కడప, జూలై 13: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడం పట్ల ఏపీ జేఏసీ అమరావతి వైఎస్సార్ కడప జిల్లా కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఇటీవల ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వంతో ప్రభుత్వం రెండు రోజుల పాటు జరిపిన చర్చలు ఉద్యోగుల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచాయని నాయకులు పేర్కొన్నారు.
గత రెండు సంవత్సరాలుగా ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని ఏపీ జేఏసీ అమరావతి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులను ఉద్యమానికి సన్నద్ధం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు నిర్వహిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి జూలై 10, 11 తేదీల్లో మంత్రుల కమిటీతో సమావేశాలు నిర్వహించడం స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు.
ఈ చర్చల్లో పీఆర్సీ కమిషన్ నియామకం, ఐఆర్ ప్రకటన, డీఏల విడుదల, పెన్షనర్లకు అదనపు ప్రయోజనాలు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు, మహిళా ఉద్యోగులకు రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్, ఆర్టీసీ బలోపేతం, గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ మరియు స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు తదితర 21 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
రానున్న ఉద్యోగ సంఘాల సమావేశంలో ఈ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం ఉద్యోగుల్లో ఉందని నాయకులు పేర్కొన్నారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావడంతో పాటు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా త్వరలో నిర్వహించాలని నిర్ణయించడం శుభపరిణామమన్నారు.
ఈ నేపథ్యంలో జూలై 12న శ్రీకాకుళంలో నిర్వహించాల్సిన తొలి ఉద్యమ సన్నద్ధత సభను తాత్కాలికంగా వాయిదా వేయాలని రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని జిల్లా కమిటీ సమర్థించింది. ఉద్యోగ సంఘాలతో జరగబోయే తదుపరి సమావేశం అనంతరం ఉద్యమ కార్యాచరణపై తుది నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేసింది.
ఈ వివరాలను ఏపీ జేఏసీ అమరావతి వైఎస్సార్ కడప జిల్లా చైర్మన్ ఆర్. జీవన్ చంద్రశేఖర్, జనరల్ సెక్రటరీ కె. కృష్ణకుమార్, ఖజాంచి కె.పీ. రొనాల్డ్, ఉమెన్స్ వింగ్ చైర్మన్ ఖతిజాబి మరియు ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు మీడియా సమావేశంలో వెల్లడించారు.



