డిపో ఎదుట ధర్నా నిర్వహించిన కార్మికులు
ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించిన ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో సంస్థ మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయు) నెల్లూరు జోనల్ అధ్యక్షులు కొన్నెపాటి పద్మారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ చైర్మన్ ఇటీవల చేసిన ప్రైవేటీకరణ వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఎన్ఎంయు ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ డిపో ఎదుట నాయకులు, కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్ఎంయు జోనల్ అధ్యక్షులు కొన్నెపాటి పద్మారావు మాట్లాడుతూ, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఏపీఎస్ఆర్టీసీ వంటి సంస్థను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం సరైన నిర్ణయం కాదన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఉద్యోగులను ఈహెచ్‌ఎస్ వైద్య విధానంలో చేర్చారని, దీని వల్ల వైద్య సేవల పరిమితి రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు మాత్రమే ఉంటోందన్నారు. గతంలో అమల్లో ఉన్న వైద్య విధానంలో రూ.30 నుంచి రూ.40 లక్షల వరకు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండేదని తెలిపారు. అందువల్ల పాత వైద్య విధానాన్ని తిరిగి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకం విజయవంతంగా అమలవుతోందని, ఈ విజయానికి ఆర్టీసీ కార్మికుల కృషి ఎంతో ఉందన్నారు. అయితే మహిళలకు జీరో టికెట్ పథకం అమలు చేయడంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగినా, అందుకు అనుగుణంగా బస్సులు, సిబ్బందిని పెంచడంలో ప్రభుత్వం దృష్టి పెట్టలేదని విమర్శించారు.పాతబడిన బస్సులతో అధికారులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పెరిగిన రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు చేస్తే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు డిపో సెక్రటరీ మస్తానయ్య, గ్యారేజీ సెక్రటరీ అహ్మద్ బాషా, సుధీర్, జమీర్, గౌస్ బాషా, ఖాదర్ బాషా, శ్రీహరి తదితర కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.


