
ఆత్మకూరు, జూలై 23 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): యూపీఎస్సీ అరుంధతివాడ ఏసీఎస్ఆర్ సచివాలయ పరిధిలోని ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (RBSK)లో భాగంగా విద్యార్థులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ సాయి ప్రసన్న ఆధ్వర్యంలో విద్యార్థుల ఎత్తు, బరువు, రక్త పరీక్షలు నిర్వహించి, అనారోగ్య సమస్యలు ఉన్న వారికి వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు.
అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి, భోజనం చేసే ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, సురక్షితమైన తాగునీటిని మాత్రమే వినియోగించాలని, తాజాగా తయారైన వేడి ఆహారాన్ని తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
డెంగ్యూ నివారణ మాసోత్సవాల సందర్భంగా హెచ్ఈఓ ఎస్. సుధాకర్, హెచ్వీ పార్వతమ్మ, హెల్త్ అసిస్టెంట్లు జి. రవీందర్ రెడ్డి, టీ. శ్రీరాములు విద్యార్థులకు డెంగ్యూ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రత, దోమల నివారణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అనంతలక్ష్మి, ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

