Sunday, 27 September 2026

Tag: బ్రేకింగ్ న్యూస్

అన్నమయ్య

నందలూరు భారత్ గ్యాస్ కార్యాలయంలో ల్యాండ్‌ఫోన్ సేవల పునరుద్ధరణకు వినతి

కడప జిల్లా నందలూరులోని భారత్ గ్యాస్ కార్యాలయంలో ల్యాండ్‌ఫోన్ సేవలు గత కొన్ని రోజులుగా అందుబాటులో లేకపోవడంతో కార్యాలయాన్ని ఫోన్ ద్వారా సంప్రదించాలనుకునే వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్‌కు సంబంధించిన సమాచారం, ఇతర వివరాల కోసం కార్యాలయాన్ని సంప్రదించడంలో కొంత అసౌకర్యం కలుగుతోంది. ఈ నేపథ్యంలో సంబంధిత బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు సమస్యను పరిశీలించి, సాంకేతిక లోపం ఏదైనా ఉంటే పరిష్కరించి ల్యాండ్‌ఫోన్ సేవలను త్వరితగతిన పునరుద్ధరించాలని వినియోగదారులు కోరుతున్నారు. సంబంధిత శాఖల సమన్వయంతో సమస్య పరిష్కారమైతే వినియోగదారులకు మరింత సౌకర్యం కలుగుతుందని భావిస్తున్నారు.

రంగారెడ్డి

రైతు రుణాలపై మేడిపల్లి ఇండియన్ బ్యాంకుపై ప్రశ్నలు!

రైతు రుణాలపై మేడిపల్లి ఇండియన్ బ్యాంకుపై ప్రశ్నలు! సివిల్‌ స్కోర్‌ తదితర కారణాలతో రుణాల మంజూరులో ఇబ్బందులా? ఇతర బ్యాంకుల వైపు చూస్తున్న రైతులు.. సమస్యలు పరిష్కరించాలని ఖాతాదారుల విజ్ఞప్తి మేడిపల్లి, సెప్టెంబర్ 11: మేడిపల్లి ఇండియన్ బ్యాంకు శాఖలో రైతు రుణాల మంజూరుపై ఖాతాదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. సివిల్‌ స్కోర్‌, ఇతర నిబంధనల పేరుతో కొందరు రైతులకు రుణాలు అందడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో రైతులు నందివనపర్తి–యాచారం ఎస్బీఐ శాఖను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రుణాల మంజూరుతో పాటు బ్యాంకు సేవలపై కూడా ఖాతాదారుల్లో అసంతృప్తి నెలకొందని సమాచారం. ప్రజాప్రతినిధులు, యువత స్పందించి శాఖ అధికారులతో మాట్లాడి అర్హులైన రైతులకు నిబంధనల ప్రకారం రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు కోరుతున్నారు. ఈ అంశంపై బ్యాంకు అధికారుల వివరణ రావాల్సి ఉంది.

రంగారెడ్డి

ప్రభుత్వ భూములపై నిర్మాణాల జోరు!

ప్రభుత్వ భూములపై నిర్మాణాల జోరు! మునుగనూర్ బ్యాంక్ కాలనీలో అక్రమ నిర్మాణాలపై స్థానికుల ఆందోళన మునుగనూర్: ప్రభుత్వ భూములకు రక్షణ కరువైందా? అక్రమ నిర్మాణాలపై అధికారుల చర్యలు ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నలు మునుగనూర్ బ్యాంక్ కాలనీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాలనీలోని కామన్ ప్రాంతానికి ఆనుకుని సర్వే నంబర్‌ 66 పట్టా భూమిని చూపిస్తూ, సర్వే నంబర్‌ 44/1కు సంబంధించిన ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారం రోజుల క్రితం సంబంధిత అధికారులు ప్రభుత్వ భూములను సర్వే చేసి మార్కింగ్ చేసినప్పటికీ, ఆ మార్కింగ్‌ను తొలగించి తిరిగి నిర్మాణ పనులు చేపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. అధికారులు గతంలో వచ్చి నిర్మాణాన్ని తొలగించినప్పటికీ, సెలవు రోజులను ఆసరాగా చేసుకుని మళ్లీ పనులు కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లోనూ నిర్మాణ పనులు చేపట్టి, పెయింటింగ్‌ వరకు పూర్తి చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. మార్కింగ్‌ చేసినా.. ఆగని పనులు! ప్రభుత్వ భూమిలో నిర్మాణానికి సంబంధించి అధికారులు మార్కింగ్‌ చేసినట్లు స్థానికులు చెబుతున్నా, దానిని తొలగించి నిర్మాణం కొనసాగించడం వెనుక ఎవరి అండదండలు ఉన్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వెనుకవైపు ప్రధాన ప్రవేశద్వారం ఉండగా, ముందు వైపున అదనపు నిర్మాణాలు చేపట్టి కమర్షియల్ షట్టర్లు ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్మాణాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని వారు కోరుతున్నారు. అనుమతులు ఎలా వచ్చాయన్నదే ప్రశ్న! “రెవెన్యూ, GHMC అనుమతులతోనే నిర్మాణాలు జరుగుతున్నాయి” అని కొందరు చెబుతున్నప్పటికీ, ప్రభుత్వ భూమికి సంబంధించిన స్థలంలో నిర్మాణ అనుమతులు ఎలా మంజూరయ్యాయి? అనుమతులు ఉంటే అవి ఏ సర్వే నంబర్‌ ఆధారంగా జారీ అయ్యాయి? నిర్మాణానికి సంబంధించిన భూమి హక్కులు, లేఅవుట్‌, బిల్డింగ్ పర్మిషన్లు, సర్వే వివరాలను అధికారులు బహిర్గతం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నిర్మాణాలను నిలిపివేయకుండా పనులు కొనసాగేందుకు అవకాశం కల్పిస్తున్నారని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నప్పటికీ, ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి నిర్ధారణ కాలేదు. ముడుపుల ఆరోపణలపై విచారణ జరపాలి అక్రమ నిర్మాణాలను అడ్డుకోకుండా ఉండేందుకు కొందరు స్థానిక నాయకులకు ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలకు ఎలాంటి అధికారిక ఆధారాలు వెలుగులోకి రాలేదు. అధికారపక్షం, ప్రతిపక్షానికి చెందిన స్థానిక నాయకులు ఈ వ్యవహారంపై స్పందించకపోవడం కూడా ప్రజల్లో అనుమానాలకు తావిస్తోందని వారు అంటున్నారు. పేదవాడికి ఒక న్యాయం.. బిల్డర్లకు మరో న్యాయమా? “60 గజాల్లో ఇల్లు నిర్మించుకునే పేదవాడిపై అనుమతులు, నిబంధనల పేరుతో చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వ భూమిలో భారీ నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నా ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదు?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సామాన్యుడైనా, బిల్డర్‌ అయినా ఒకే విధంగా చట్టపరమైన చర్యలు ఉండాలని వారు కోరుతున్నారు. 1–27 గుంటల భూమిపై స్పష్టత ఇవ్వాలి ఇప్పటికే సుమారు 1 ఎకరం 27 గుంటల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భూమిలో నిర్మాణాలు జరిగి ఉంటే వాటి వెనుక ఉన్న వ్యక్తులు, నిర్మాణ అనుమతులు, భూమి హక్కులు, సంబంధిత రికార్డులను అధికారులు సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమణ నిజమని తేలితే బాధ్యులపై కేసులు నమోదు చేసి, ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ భూముల పరిరక్షణపై సమావేశాల్లో పదేపదే సూచనలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన రెవెన్యూ శాఖ, GHMC టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు తక్షణమే స్పందించి స్థలాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. సర్వే నంబర్లు, భూమి హక్కులు, నిర్మాణ అనుమతులు, ప్రభుత్వ భూమి విస్తీర్ణం తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని మునుగనూర్‌ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు నిర్ధారణ అయితే వాటిని నిలిపివేసి, నిబంధనలకు విరుద్ధంగా మంజూరైన అనుమతులను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రంగారెడ్డి

తాళాలు తొలగించి.. రూ.13.50 లక్షలు చోరీ!

తాళాలు తొలగించి.. రూ.13.50 లక్షలు చోరీ! కుంట్లూర్‌ భూదాన్‌ జయప్రకాష్‌నగర్‌లో ఘటన.. ఇద్దరు దొంగల కదలికలు సీసీ కెమెరాలో రికార్డు హయత్‌నగర్‌, సెప్టెంబర్‌ 11: హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కుంట్లూర్‌ భూదాన్‌ జయప్రకాష్‌నగర్‌లో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. ఓ ఇంటికి వేసిన తాళాలను తొలగించి ఇద్దరు వ్యక్తులు లోపలికి చొరబడి భారీ మొత్తంలో నగదును అపహరించినట్లు సమాచారం. ఇంట్లో భద్రపరిచిన రూ.13 లక్షల 50 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పక్కా ప్రణాళికతో చోరీకి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాళాలను తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తుల కదలికలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు తెలుస్తోంది. చోరీ అనంతరం నిందితులు అక్కడి నుంచి నగదుతో పరారైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న హయత్‌నగర్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల గుర్తింపు కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చోరీ జరిగిన ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. Uploaded Video:

రంగారెడ్డి

అనుమతుల్లేని షెడ్లపై అధికారుల కొరడా! హయత్‌నగర్‌లో రెండు భారీ షెడ్లు సీజ్‌

అనుమతుల్లేని షెడ్లపై అధికారుల కొరడా! హయత్‌నగర్‌లో రెండు భారీ షెడ్లు సీజ్‌ సాయిబాబా గుడి వెనుక, వనస్థలిపురం రోడ్డులో చర్యలు హయత్‌నగర్‌, సెప్టెంబర్‌ 10 (పున్నమి న్యూస్‌): ఎల్బీనగర్‌ సర్కిల్‌ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ షెడ్లపై అధికారులు చర్యలు చేపట్టారు. హయత్‌నగర్‌ సాయిబాబా గుడి వెనుక వైపు నిర్మిస్తున్న భారీ షెడ్‌తో పాటు వనస్థలిపురం రోడ్డులోని మరో షెడ్డును గురువారం సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. సాయిబాబా గుడి వెనుక వైపు రేకులు, ఇనుప సామగ్రితో భారీ షెడ్‌ నిర్మాణం చేపట్టినట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అధికారులు పరిశీలించారు. నిర్మాణానికి సంబంధిత అనుమతులు లేనట్లు గుర్తించడంతో షెడ్డును సీజ్‌ చేసినట్లు తెలిపారు. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న సమయంలో అధికారులు చర్యలు తీసుకోవడం గమనార్హం. ఈ విషయంపై ఏసీపీ విజయలక్ష్మి, పట్టణ ప్రణాళిక అధికారి సోమేశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేసినట్లు పున్నమి న్యూస్‌కు స్పందించారు. అధికారుల చర్యతో అక్రమ నిర్మాణాలపై పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేయాలనే డిమాండ్‌ స్థానికుల నుంచి వినిపిస్తోంది.

రంగారెడ్డి

తెలంగాణ రైతాంగ పోరాట వారసులు కమ్యూనిస్టులే!

తెలంగాణ రైతాంగ పోరాట వారసులు కమ్యూనిస్టులే! చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు – సీపీఎం యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా యాచారం, సెప్టెంబర్ 10: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి, వారోత్సవాలను పురస్కరించుకుని సీపీఎం యాచారం మండల కమిటీ ఆధ్వర్యంలో యాచారం మండల కేంద్రంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీపీఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ రైతాంగం సాగించిన పోరాటం చారిత్రాత్మకమన్నారు. దొడ్డి కొమురయ్య, చిట్యాల ఐలమ్మతో పాటు పలువురు పోరాట యోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ పోరాటం ద్వారా వేలాది మంది ప్రాణత్యాగం చేశారని, లక్షల ఎకరాల భూమి పేదలకు దక్కిందని పేర్కొన్నారు. రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని నర్సింహా విమర్శించారు. మతపరమైన రాజకీయాలకు చరిత్రను ఉపయోగించుకోవడం సరికాదన్నారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై సీపీఎం నిరంతరం ఉద్యమిస్తుందని, యాచారం మండలంలోని స్థానిక సమస్యలపై భవిష్యత్తులో ఆందోళనలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు, మండల కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రంగారెడ్డి

వినాయక ఉత్సవాలకు పోలీసుల భద్రతా సూచనలు

వినాయక ఉత్సవాలకు పోలీసుల భద్రతా సూచనలు మండపాల వద్ద నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి : CI సత్యనారాయణ కందుకూరు/యాచారం, సెప్టెంబర్ 10: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక మండపాల నిర్వాహకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. సీఐ బి. సత్యనారాయణ ఆదేశాల మేరకు ఎస్‌ఐలు డి. సునీల్ కుమార్, జి. సైదులు, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులకు పోలీసులు పలు సూచనలు చేశారు. మండపాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు ముందుగానే తీసుకోవాలని, విద్యుత్ షార్ట్‌సర్క్యూట్, అగ్నిప్రమాదాల నివారణకు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. లౌడ్‌స్పీకర్లు, డీజేల వినియోగంలో ప్రభుత్వ నిబంధనలు, శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. వినాయక ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరిగేలా మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించాలని సీఐ బి. సత్యనారాయణ కోరారు. ఎలాంటి సమస్యలు, అనుమానాస్పద ఘటనలు ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

రంగారెడ్డి

బడి గడప దగ్గర.. భద్రతకు బీటలు! విద్యార్థుల రాకపోకల సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్‌.. రక్షణ చర్యలపై ఆందోళన

బడి గడప దగ్గర.. భద్రతకు బీటలు! విద్యార్థుల రాకపోకల సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్‌.. రక్షణ చర్యలపై ఆందోళన విద్యార్థుల దారిలో.. విద్యుత్‌ ముప్పు! బడి గేటు వద్ద ‘రిస్క్‌’.. భద్రత ఎక్కడ!? చదువుల మధ్య.. ప్రమాదపు ఛాయలు! బాలల భద్రతకు.. బ్యానర్లే బందోబస్తా!? పాఠశాల గడప వద్దే.. ప్రశ్నార్థకంగా సేఫ్టీ! అనుమతులపై అనుమానాలు.. విద్యార్థుల భద్రతపై ఆందోళనలు! శ్రీధృతి స్కూల్‌పై ఫిర్యాదులు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్.. చుట్టూ బ్యానర్లే రక్షణ కంచెనా? ఎంఈఓకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆరోపణలు రంగారెడ్డి జిల్లా, హయత్‌నగర్, సెప్టెంబర్ 9: విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన విద్యాసంస్థల వద్ద భద్రతా ప్రమాణాల అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హయత్‌నగర్–కుంట్లూరు ప్రధాన రహదారి పరిధిలోని శ్రీధృతి/సాంక్టస్ వరల్డ్ స్కూల్కు సంబంధించి అనుమతులు, భద్రతా ప్రమాణాలు, నిర్మాణ పనులపై ఫిర్యాదులు వెలువడటంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పాఠశాల ప్రధాన ద్వారం సమీపంలోనే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఉండటం, దాని చుట్టూ విద్యార్థులు మరియు ప్రజలు సులభంగా చేరకుండా పటిష్టమైన రక్షణ చర్యలు ఉన్నాయా? అనే ప్రశ్నలు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ రక్షణ కంచెకు బదులుగా బ్యానర్లు ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బ్యానర్లే భద్రతా కంచెనా? విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వంటి ప్రమాదకర పరికరాల చుట్టూ తగిన రక్షణ చర్యలు ఉండాల్సిన నేపథ్యంలో కేవలం బ్యానర్లు ఏర్పాటు చేయడం సరిపోతుందా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు రాకపోకలు సాగించే ప్రాంతానికి ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో ఉండటంతో అధికారులు తక్షణమే పరిస్థితిని పరిశీలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. తరగతులు.. మరోవైపు నిర్మాణ పనులు? పాఠశాలలో విద్యార్థులకు తరగతులు కొనసాగుతున్న సమయంలోనే నిర్మాణ పనులు జరుగుతున్నట్లు వచ్చిన ఆరోపణలు కూడా ఆందోళనకు కారణమవుతున్నాయి. నిర్మాణ ప్రాంతం, విద్యుత్ పరికరాల సమీపంలో విద్యార్థుల రాకపోకలు ఉంటే భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టంగా ఉండాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఎంఈఓకు ఫిర్యాదు చేసినా స్పందన లేదంటూ ఆరోపణలు పాఠశాల వద్ద భద్రతా పరిస్థితులు, అనుమతులకు సంబంధించిన అంశాలపై గతంలోనే మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై విద్యాశాఖ అధికారులు సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని వారు కోరుతున్నారు. కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు శ్రీధృతి స్కూల్‌కు సంబంధించిన అనుమతులు, నిబంధనల అమలు, విద్యార్థుల భద్రత తదితర అంశాలపై బి.సి. చైతన్య వేదిక విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు నగేష్ సూర్యవంశం ప్రజావాణిలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ‘నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు’ పాఠశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు విచారణలో తేలితే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) పేర్కొన్నట్లు ఫిర్యాదుదారులు తెలిపారు. అలాగే సంబంధిత అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని వారు పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు, పాఠశాల యాజమాన్యం అధికారికంగా స్పందించాల్సి ఉంది. ప్రమాదం జరిగే వరకు వేచి చూడొద్దు విద్యార్థుల భద్రత విషయంలో ఏ చిన్న లోపాన్నీ నిర్లక్ష్యం చేయరాదని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యాశాఖ, విద్యుత్ శాఖ అధికారులు సంయుక్తంగా పాఠశాల పరిసరాలను పరిశీలించి, ట్రాన్స్‌ఫార్మర్ వద్ద రక్షణ కంచె, హెచ్చరిక బోర్డులు, విద్యార్థుల రాకపోకలకు సురక్షిత మార్గం వంటి అంశాలను పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. అనుమతులు, భద్రతా ప్రమాణాలు, నిర్మాణ పనులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

రంగారెడ్డి

ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి నీట్‌లో సత్తా!

ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి నీట్‌లో సత్తా! ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించిన గిరిజన విద్యార్థి యాచారం, సెప్టెంబర్ 9: మారుమూల తండాకు చెందిన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన గిరిజన విద్యార్థి విస్లావత్ శివ ప్రతిభ చాటుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం సాగించిన శివ ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో 700 మార్కులకు 501 మార్కులు సాధించి, ఉస్మానియా ఆస్పత్రి/మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించాడు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం పచెల్కతాండాకు చెందిన విస్లావత్ భాస్కర్, కమిలి దంపతుల కుమారుడు శివ తన ప్రాథమిక విద్యను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అభ్యసించాడు. యాచారం మండలం నక్కర్త–మేడిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2022–23 విద్యా సంవత్సరంలో ఎస్‌ఎస్‌సీ పూర్తి చేశాడు. నీట్‌లో మంచి ఫలితం సాధించి మెడికల్ సీటు పొందిన అనంతరం బుధవారం తనకు విద్యాబుద్ధులు నేర్పిన మేడిపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను శివ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా PRG ఫౌండేషన్ అధ్యక్షులు ప్రొద్దుటూరి రవీందర్ గుప్త, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉదయశ్రీతో పాటు ఉపాధ్యాయులు శివను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు కూడా పట్టుదల, కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని శివ నిరూపించాడని అన్నారు. శివను స్ఫూర్తిగా తీసుకుని ఇతర విద్యార్థులు కూడా లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మారుమూల తండా నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదివి వైద్య విద్యలో సీటు సాధించిన శివ విజయంతో మేడిపల్లి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

యాచారం మండలంలో బెల్ట్‌ షాపుల జోరు..?

యాచారం మండలంలో బెల్ట్‌ షాపుల జోరు..? గ్రామ పంచాయతీల పరిధిలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలపై ప్రజల ఆందోళన అనధికార మద్యం విక్రయాలపై అధికారులు దృష్టి సారించాలంటున్న గ్రామస్తులు యాచారం, సెప్టెంబర్‌ 8: మండల పరిధిలోని పలు గ్రామ పంచాయతీల్లో బెల్ట్‌ షాపుల పేరుతో మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో అనుమతులు లేని ప్రాంతాల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తుండటంతో సంబంధిత ఎక్సైజ్‌, పోలీస్‌, పంచాయతీ అధికారులు సమగ్రంగా తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామాల్లో ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు, కిరాణా దుకాణాల సమీపంలో కూడా మద్యం అందుబాటులోకి వస్తోందని కొందరు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో మద్యం కొనుగోలు చేసేందుకు యువత, ఇతరులు గుమిగూడుతుండటంతో మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. బెల్ట్‌ షాపులపై నిఘా ఎక్కడ..!? ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయా? ఒకవేళ జరుగుతున్నట్లయితే వాటికి మద్యం ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు. అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు ఉంటే వాటిపై అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు. కుటుంబాలపై ప్రభావం గ్రామాల్లో మద్యం సులభంగా అందుబాటులో ఉండటం వల్ల కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు, గొడవలు పెరుగుతున్నాయని కొందరు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ కూలీ పనులు చేసుకునే కుటుంబాల్లో మద్యం కోసం ఆదాయంలో కొంత భాగం ఖర్చు కావడం వల్ల కుటుంబ అవసరాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు చెబుతున్నారు. రాత్రివేళల్లో ఇబ్బందులు కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళల్లో మద్యం సేవించి రహదారులపై తిరిగే వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు కూడా ఉంటుందని, అధికారులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలను ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. యువతపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో యువత మద్యం వైపు ఆకర్షితులు కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అధికారుల తనిఖీలకు డిమాండ్‌ యాచారం మండలంలోని గ్రామ పంచాయతీల పరిధిలో మద్యం విక్రయాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఎక్సైజ్‌ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. లైసెన్స్‌ ఉన్న మద్యం దుకాణాల నుంచి అనధికారికంగా మద్యం తరలిస్తున్నారా? లేదా ఇతర మార్గాల్లో మద్యం సరఫరా అవుతోందా? అన్న అంశాలపై విచారణ జరిపితే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వారు అంటున్నారు. ప్రజల ఫిర్యాదులను అధికారులు పరిగణనలోకి తీసుకుని గ్రామాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే అనధికార విక్రయాలు లేవని అధికారులు భావిస్తే, తనిఖీల అనంతరం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.