Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: అనకాపల్లి జిల్లా

అనకాపల్లి

ఎర్రవరంలో టీడీపీకి తిరుగులేదు.. వైసీపీలోకి భారీ వలసల ప్రచారం అవాస్తవం!

యలమంచిలి: మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రవరం వార్డు నుంచి టీడీపీకి చెందిన పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరినట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా కల్పితమని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, మాజీ పార్లమెంట్ సభ్యుడు పప్పల చలపతిరావు స్పష్టం చేశారు. ఎర్రవరం వార్డుకు చెందిన ఒక వ్యక్తి కౌన్సిలర్ టికెట్ ఆశించి మరో పార్టీలోకి వెళ్లారని, అంతమాత్రాన పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పార్టీని వీడినట్లు ప్రచారం చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీ నుంచి భారీగా వలసలు జరిగాయంటూ ప్రచారం చేయడం సరికాదన్నారు. యలమంచిలి మున్సిపాలిటీలోని 16వ వార్డు ఎర్రవరంలో టీడీపీ అత్యంత పటిష్టంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. టౌన్ ప్రెసిడెంట్ గొర్లి శివనారాయణ మాట్లాడుతూ.. వార్డులో క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు పార్టీకి అండగా ఉన్నారని తెలిపారు. ఒక్క వ్యక్తి పార్టీ మారితే టీడీపీకి షాక్ తగిలిందంటూ ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యకర్తలే టీడీపీకి బలమని, కూటమికి కట్టుబడి పార్టీ శ్రేణులు పనిచేస్తాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జిలు బొద్దపు శ్రీనివాసరావు, కరణం రవికుమార్, జిల్లా అధికార ప్రతినిధి దాడి రమేష్, యూత్ ప్రెసిడెంట్ నమ్మి రమణ, యూనిట్ ఇన్‌చార్జి శానాపతి రాజమహేష్, బూత్ ఇన్‌చార్జి చంద్రగిరి శ్రీరాములు, శానాపతి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

అనకాపల్లి

ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు పీజీఆర్‌ఎస్‌ నిలిపివేత

డిసెంబర్‌ 3 వరకు ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు తాత్కాలిక విరామం స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని డిసెంబర్‌ 3వ తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా, ఐపీఎస్‌ వెల్లడించారు. జిల్లాలో మున్సిపల్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 3 వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం విస్తృత బందోబస్తు, శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో నిమగ్నమై ఉందన్నారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను అధికారులు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌ తాత్కాలిక నిలిపివేత విషయాన్ని ప్రజలు, ఫిర్యాదుదారులు గమనించి పోలీసు శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అనకాపల్లి

ఏటికొప్పాకలో భక్తి పారవశ్యం.. ఘనంగా శ్రీ దుర్గామాత బోనాల ఊరేగింపు!

అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక గ్రామంలో ఆదివారం సాయంత్రం శివాలయం కమిటీ ఆధ్వర్యంలో శ్రీ దుర్గామాత బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ ప్రజల సహకారంతో జరిగిన బోనాల ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారిపై భక్తిని చాటుకుంటూ మహిళలు బోనాలను సమర్పించి, ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు.అమ్మవారి బోనాలతో గ్రామ వీధుల్లో నిర్వహించిన ఊరేగింపులో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి నామస్మరణలు, భక్తుల జయజయధ్వానాలతో గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహిళలు, యువత, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని వేడుకను భక్తిమయంగా మార్చారు.గ్రామ ప్రజల ఐకమత్యం, శివాలయం కమిటీ సభ్యుల సమన్వయం, భక్తుల సహకారంతో బోనాల ఊరేగింపు ఘనంగా సాగింది. సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను గ్రామస్థులంతా కలిసికట్టుగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీ దుర్గామాత ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో జీవించాలని భక్తులు ప్రార్థించారు.

అనకాపల్లి

ఎన్నికల వేళ అల్లర్లు సృష్టిస్తే పీడీ యాక్ట్‌ ప్రయోగం: ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరిక

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు నర్సీపట్నం, కసింకోట పోలీస్‌ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, పాత నేరస్థులు, చెడు నడత కలిగిన వ్యక్తులకు పోలీసులు ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, ఓటర్లను బెదిరించినా, ఘర్షణలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌తో సహా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు పర్యవేక్షణలో టౌన్‌ సీఐ గఫూర్‌, ఎస్సై ఉమామహేశ్వర్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అనకాపల్లి డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు పర్యవేక్షణలో కసింకోట ఇన్‌స్పెక్టర్‌ స్వామి నాయుడు రౌడీషీటర్లను హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.

అనకాపల్లి

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: డీఎస్పీ నరసింహారావు

స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు అనకాపల్లి డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం శాంతిభద్రతల చర్యలు అమల్లోకి వచ్చాయన్నారు.అనకాపల్లి డివిజన్‌ వ్యాప్తంగా సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉందని, ముందస్తు అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు, బైక్‌ ర్యాలీలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం, బహుమతులు పంపిణీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అక్రమ రవాణాపై ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, ఓటర్లను బెదిరించే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ నాయకులు పోలీసులకు సహకరించాలని డీఎస్పీ కోరారు.

అనకాపల్లి

జిల్లా స్థాయి చెస్ పోటీల్లో తుమ్మపాల చిన్నారి ధీరజ్ నందన్‌కు ప్రత్యేక బహుమతి

తుమ్మపాల చిన్నారి దాడి ధీరజ్ నందన్ జిల్లా స్థాయి చెస్ పోటీల్లో ప్రత్యేక బహుమతి అందుకుని తన ప్రతిభను చాటుకున్నాడు. అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట గ్రామంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి చదరంగం పోటీల్లో పాల్గొన్న ధీరజ్ నందన్ తన ఆటతీరుతో నిర్వాహకుల ప్రశంసలు అందుకున్నాడు.చిన్న వయస్సులోనే చదరంగంపై ఆసక్తి పెంచుకుని, ఏకాగ్రత, ఆలోచనా శక్తి, సమయస్ఫూర్తితో పోటీల్లో రాణించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోటీల నిర్వాహకులు, ప్రముఖులు, మేధావులు, గ్రామ పెద్దలు చిన్నారి ధీరజ్ నందన్‌ను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.చదరంగం వంటి మేధో క్రీడలు చిన్నారుల్లో ఆలోచనా సామర్థ్యాన్ని, నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాన్ని పెంపొందిస్తాయని పలువురు తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్లోని ప్రతిభను గుర్తించి క్రీడల పట్ల ఆసక్తిని ప్రోత్సహించాలని సూచించారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రత్యేక బహుమతి సాధించిన ధీరజ్ నందన్ తుమ్మపాల గ్రామానికి గర్వకారణంగా నిలిచాడని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

అనకాపల్లి

జనసేనకు రాజీనామా.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి శ్రీకాంత్ దంపతులు

యలమంచిలి: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలానికి చెందిన ఆడారి శ్రీకాంత్, కమల ప్రియ దంపతులు జనసేన పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మునగపాక మాజీ జడ్పీటీసీ, సర్పంచ్ ఆడారి సరోజినీ సత్యనారాయణ దంపతుల కుమారుడైన శ్రీకాంత్ తన భార్య కమల ప్రియతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరడం స్థానికంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.వైఎస్సార్‌సీపీ మాజీ ప్రభుత్వ విప్, యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్‌లు ఆడారి శ్రీకాంత్, కమల ప్రియ దంపతులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

అనకాపల్లి

యలమంచిలి కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా నాగుమంత్రి శాంతి నామినేషన్ దాఖలు

యలమంచిలి: యలమంచిలి మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ పదవికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాగుమంత్రి శాంతి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పీఏసీ సభ్యుడు ఎం. పల్లంరాజు, జిల్లా ఇన్‌ఛార్జి జీవీవీ కమలాకర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాస్ ఆశీస్సులతో నాగుమంత్రి శాంతిని పార్టీ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మహిళా కాంగ్రెస్ నాయకురాలిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, వివిధ ప్రజా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న శాంతికి అభ్యర్థిత్వం దక్కడంపై పార్టీ శ్రేణులు, మద్దతుదారులు హర్షం వ్యక్తం చేశారు. నామినేషన్ దాఖలుతో యలమంచిలి మున్సిపల్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని నిలిపింది. రాబోయే ఎన్నికల్లో ప్రజల మద్దతుతో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి.

అనకాపల్లి

కొక్కిరాపల్లి నుంచి భారీ ర్యాలీ.. టీడీపీ అభ్యర్థిగా మజ్జి ఉమా మహేశ్వరి నామినేషన్!

యలమంచిలి మున్సిపాలిటీ 31వ వార్డు కొక్కిరాపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా మజ్జి ఉమా మహేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గ్రామం నుంచి యలమంచిలి పురపాలక కార్యాలయం వరకు గ్రామ కుటుంబ సభ్యులు, కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. బైక్‌లు, ఆటోలపై ఉత్సాహంగా ర్యాలీగా బయలుదేరిన నాయకులు, కార్యకర్తలు మధ్యాహ్నం 1:15 గంటలకు పురపాలక కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం మజ్జి ఉమా మహేశ్వరి తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆమెకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మజ్జి వీరబాబు, మజ్జి రామకృష్ణ, సీనియర్ నాయకులు పొలరౌతు నాగేశ్వరరావు, రాంబాబు, మజ్జి రాంబాబు, చిన్నబ్బాయి, శ్రీనివాసరావు, అప్పలనాయుడు, చంటి తదితరులతో పాటు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వారితో నామినేషన్ కార్యక్రమం సందడిగా సాగింది.

అనకాపల్లి

ఎలమంచిలిలో టీడీపీకి భారీ షాక్‌.. కరణం ధర్మశ్రీ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి 150 మంది కార్యకర్తలు!

ఎలమంచిలి మున్సిపాలిటీ 16వ వార్డులో తెలుగుదేశం పార్టీకి చెందిన 150 మంది కార్యకర్తలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సేనాపతి తులసిరావు తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకోవడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.వైఎస్సార్‌సీపీపై నమ్మకంతో, పార్టీ నాయకుడు కరణం ధర్మశ్రీ నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. 16వ వార్డుకు చెందిన పెద్దలు దూది శ్రీరామమూర్తి, పిట్ట సత్తిబాబు, కిలాడ సత్యనారాయణల చొరవతో కరణం ధర్మశ్రీ సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరణం ధర్మశ్రీ పార్టీలో చేరిన వారిని సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోదెపు గోవింద్, బెజవాడ నాగేశ్వరరావు, బొద్దపు ఎర్రయ్య దొర తదితరులు పాల్గొన్నారు.