Tuesday, 22 September 2026

Tag: V

తిరుపతి

శీర్షిక: మొలకలపూడి మహిళా ఆశ్రమంలో ఘనంగా రాఖీ వేడుకలు*

*శీర్షిక: మొలకలపూడి మహిళా ఆశ్రమంలో ఘనంగా రాఖీ వేడుకలు* *చిట్టమూరు, ఆగస్టు 28:* తిరుపతి జిల్లా, చిట్టమూరు మండలం, మొలకలపూడిలోని మహార్ ఆశ్రమంలో రాఖీ పండుగ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఆశ్రమంలోని చిన్నారులు, మహిళలు కలిసి రాఖీ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ ప్రాంగణంలో ప్రత్యేకంగా ముగ్గు వేసి, ‘HAPPY RAKSHA BANDHAN’ అని రంగులతో అలంకరించారు. చిన్నారులు ఒకరికొకరు రాఖీలు కట్టుకుని సోదరభావాన్ని చాటుకున్నారు. ఆశ్రమంలోని వృద్ధ మహిళలు చిన్నారులకు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ ఇన్చార్జి బ్రో నీ గారు,చంద్ర గారు , ఇమ్మనేయల్ గారు సిబ్బంది పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రాఖీ పండుగ అనేది అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అని, ఆశ్రమంలో అందరూ ఒకే కుటుంబంలా కలిసి మెలిసి ఉంటారని తెలిపారు. అనాథలు, మానసిక వికలాంగులు, వృద్ధులకు పండుగ సంతోషాన్ని పంచడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ వేడుకల్లో ఆశ్రమానికి చెందిన 30 మందికి పైగా మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

తిరుపతి

ఓజిలి మండలంలో నూతన పరిశ్రమ ఆక్టేవ్ ఫార్మాస్యూటికల్ ప్రారంభం

స్థానిక యువతకు ఎక్కువ శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలి: ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పున్నమి న్యూస్ ఓజిలి తిరుపతి జిల్లా ఓజిలి మండలం కారూరు గ్రామంలో సుమారు రూ.57 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఆక్టేవ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రారంభం కావడం నియోజకవర్గానికి శుభపరిణామమని ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. హ్యూమన్ మెడికేషన్‌కు సంబంధించిన ఔషధాలను తయారు చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో పరిశ్రమను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కంపెనీలోని వివిధ విభాగాలను, ఔషధాల తయారీకి ఏర్పాటు చేసిన ఆధునిక యంత్ర పరికరాలను ఈ సందర్భంగా పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కంపెనీలో ఆధునిక సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సెంట్రిఫ్యూజ్, డ్రైయింగ్ తదితర ప్రక్రియలకు అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉండటంతో నాణ్యమైన ఔషధాల తయారీకి అవకాశం ఉందన్నారు. ఈ పరిశ్రమ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నందున, స్థానిక యువతకు ప్రాధాన్యతనిస్తూ వీలైనంత ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కంపెనీ యాజమాన్యాన్ని కోరారు. ముఖ్యంగా సురేష్, రవి తదితర యాజమాన్య ప్రతినిధులు స్థానిక యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వారి కృషితో నియోజకవర్గంలోని అత్తివరం, మేనకూరు,తడ, శ్రీసిటీ, మాంబట్టు తదితర ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు నియోజకవర్గానికి తీసుకువచ్చి ప్రజలకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించేలా అందరూ కలిసి పనిచేస్తామని తెలిపారు. ఆక్టేవ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, సంస్థ మరింత అభివృద్ధి చెంది నియోజకవర్గానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

తిరుపతి

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిందితుడికి 10 రోజుల జైలు శిక్ష

⛔రూ.12,500 జరిమానా విధించిన నాయుడుపేట కోర్టు పున్నమి న్యూస్ నాయుడుపేట తిరుపతి జిల్లా నాయుడుపేట హైవేపై మద్యం సేవించి కంటైనర్ లారీని అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్‌కు నాయుడుపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు 10 రోజుల జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించినట్లు నాయుడుపేట సిఐవెంకటేశ్వరరావు మీడియా సమావేశం తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి సుమారు 1:30 గంటల సమయంలో చెన్నై నుంచి నెల్లూరు వైపు జాతీయ రహదారిపై కంటైనర్ లారీ నంబర్ TN-88-J-2370ను డ్రైవర్ తియగరాజన్ అతివేగంగా, నిర్లక్ష్యంగా, ప్రమాదకరంగా నడుపుతున్నట్లు డయల్-112 ద్వారా పోలీసులకు సమాచారం అందుకున్న వెంటనే నాయుడుపేట పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఎం. శివశంకర్ రావు, బీట్ సిబ్బందితో కలిసి మల్లాం జంక్షన్ సమీపానికి చేరుకుని లారీని అడ్డుకుని తనిఖీ చేశారు. బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా డ్రైవర్ మద్యం సేవించినట్లు నమోదైంది. దీంతో నిందితుడిపై నాయుడుపేట పోలీస్ స్టేషన్‌లో ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు పూర్తి అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన నాయుడుపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కుమారి పి. మీనాక్షి సుందరి నిందితుడికి 10 రోజుల జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా వాహనదారులు తమ ప్రాణాలతో పాటు రహదారిపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారని తెలిపారు. మద్యం మత్తులో, అతివేగంగా, నిర్లక్ష్యంగా లేదా ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు కోర్టు ద్వారా శిక్షలు పడేలా చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనం నడపాలని సూచించారు.

తిరుపతి

🚨🔴 రాత్రివేళ మహిళా హాస్టళ్లపై నిఘా అవసరం 🔴🚨

⚠️ శ్రీ సిటీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల భద్రతపై అధికారుల దృష్టి సారించాలి ⚠️ 🔍 *ప్రైవేట్ హాస్టళ్లపై ప్రత్యేక తనిఖీలు అవసరం* శ్రీ సిటీ పారిశ్రామిక ప్రాంతంలోని వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు నివసించే ప్రైవేట్ హాస్టళ్ల భద్రతా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 🏛️ *హాస్టళ్లకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా?* 🔹 మహిళా హాస్టల్ నిర్వహణకు అవసరమైన ప్రభుత్వ లేదా సంబంధిత స్థానిక సంస్థల అనుమతులు ఉన్నాయా? 🔹 భవనానికి, వినియోగానికి సంబంధించిన అనుమతులు సక్రమంగా ఉన్నాయా? 🔹 ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అనుమతులు, ధ్రువపత్రాలు చెల్లుబాటులో ఉన్నాయా? 🔹 హాస్టల్ నిర్వాహకులు నిబంధనల ప్రకారం నమోదు చేసుకున్నారా? 🔹 భద్రతా సిబ్బంది, వార్డెన్లు, కేర్‌టేకర్ల వివరాలు సక్రమంగా ఉన్నాయా? అనే అంశాలను సంబంధిత అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది. 💰 *హాస్టల్ ఫీజులపై కూడా తనిఖీ అవసరం* 🔸 మహిళా ఉద్యోగుల నుంచి ప్రైవేట్ హాస్టల్ నిర్వాహకులు అధిక మొత్తంలో హాస్టల్ ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో అధికారులు దీనిపైనా దృష్టి సారించాలనే డిమాండ్లు వస్తున్నాయి. 🔹 హాస్టల్ ఫీజు ఎంత వసూలు చేస్తున్నారు? 🔹 వసూలు చేస్తున్న మొత్తానికి రసీదులు ఇస్తున్నారా? 🔹 భోజనం, విద్యుత్, నీరు, ఇతర సౌకర్యాల పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారా? 🔹 ఉద్యోగులకు ముందుగానే ఫీజులు, ఇతర ఛార్జీల వివరాలు స్పష్టంగా తెలియజేస్తున్నారా? 🔹 వసూలు చేస్తున్న ఫీజుకు అనుగుణంగా వసతి, భోజనం, భద్రతా సౌకర్యాలు అందుతున్నాయా? అనే అంశాలపై సంబంధిత అధికారులు విచారణ చేసి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 🚨 *ఉద్యోగుల వివరాలు సక్రమంగా నమోదు చేస్తున్నారా?* 🔹 హాస్టళ్లలో నివసిస్తున్న ఉద్యోగుల వివరాలు సక్రమంగా నమోదు చేస్తున్నారా? 🔹 మహిళా ఉద్యోగుల పేరు, కంపెనీ, అత్యవసర సంప్రదింపు వివరాలు రికార్డుల్లో ఉన్నాయా? 🔹 అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన కుటుంబ సభ్యుల వివరాలు నిర్వాహకుల వద్ద ఉన్నాయా? 🔹 ఉద్యోగుల ప్రవేశ–నిష్క్రమణ వివరాలు నిబంధనల ప్రకారం నమోదు చేస్తున్నారా? 🍽️ *మహిళా ఉద్యోగులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా?* హాస్టల్‌లో నివసిస్తున్న మహిళా ఉద్యోగులకు పరిశుభ్రమైన, నాణ్యమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందిస్తున్నారా అనే అంశాన్ని కూడా అధికారులు పరిశీలించాలి. 🔥 *ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా ఉండాలి* 🧯 అగ్నిమాపక పరికరాలు 🚨 ఫైర్ అలారం 🚪 అత్యవసర నిష్క్రమణ మార్గాలు ⚡ విద్యుత్ భద్రత 👩‍🚒 అగ్ని ప్రమాదాలపై సిబ్బందికి అవగాహన వంటి భద్రతా ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా లేదా తనిఖీ చేయాలి. 🌙 *రాత్రివేళల్లో భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా?* రాత్రి వేళల్లో మహిళా వార్డెన్లు, కేర్‌టేకర్లు, సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో ఉన్నారా? సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? గేటు భద్రత సక్రమంగా ఉందా? అనే అంశాలను పరిశీలించాలి. 👮‍♀️ *పోలీసుల నిఘా పెంచాలి* 🚔 రాత్రి పెట్రోలింగ్ 🔍 ఆకస్మిక తనిఖీలు 📹 సీసీ కెమెరాల పరిశీలన 🛡️ భద్రతా సిబ్బంది తనిఖీ *వంటి చర్యలను పెంచాలని పలువురు కోరుతున్నారు.* ⚖️ *భద్రతతో పాటు వ్యక్తిగత స్వేచ్ఛకు గౌరవం* మహిళలు రాత్రివేళ బయటకు వెళ్లడం మాత్రమే తప్పిదంగా పరిగణించకుండా, వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా భద్రతా ప్రమాణాలు, హాస్టల్ నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్నదే అధికారులు పరిశీలించాల్సిన అంశమని పలువురు అభిప్రాయపడుతున్నారు. 🤝 *కంపెనీలు–హాస్టల్ నిర్వాహకులు–పోలీసుల సమన్వయం అవసరం* మహిళా ఉద్యోగుల భద్రత కోసం కంపెనీల యాజమాన్యాలు, హాస్టల్ నిర్వాహకులు, పోలీసులు సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఉద్యోగుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 🚨 *మహిళా ఉద్యోగుల భద్రతే ప్రధాన లక్ష్యం* 🛡️ 📍 | *సూళ్లూరుపేట నియోజకవర్గం*

తిరుపతి

*కుప్పారెడ్డి పాలెంలో నూతన ఆలయానికి భూమి పూజ*

దొరవారిసత్రం, ఆగస్టు 27 (పున్నమి న్యూస్)* తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డి పాలెం గ్రామంలో నూతన ఆలయ నిర్మాణానికి బుధవారం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య భూమి పూజ నిర్వహించారు. గ్రామ అభివృద్ధి మరియు భక్తుల మనోభీష్టం మేరకు ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఇటుకలకు పసుపు కుంకుమలతో అలంకరించి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఊరి పెద్దలు శివ రెడ్డి గారు,సుబ్బా రెడ్డి గారు,బుజమ్మ గారు శ్రీనా రెడ్డీ గారు, శ్రీధర్ రెడ్డి గారు,జమ్మల మణి గారు,బల్లి విజయ్ గారు,జమ్మల ఉమాపతి గారు, జమ్మల మనోహర్ గారు, కిన్నెరి రమణయ్య గారు, కిన్నెరి హరిబాబు గారు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తిరుపతి

*పూడికుప్పంలో రూ.34 లక్షలతో మోడల్ అంగన్వాడీ కేంద్రం*

ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ ప్రారంభం *తడ, ఆగస్టు 26 తిరుపతి జిల్లా తడ మండలం పూడికుప్పం గ్రామంలో ‘సెయింట్ గోబైన్’ సంస్థ జాయింట్ నిధులు రూ.34 లక్షలతో నిర్మించిన నూతన మోడల్ అంగన్వాడీ భవనాన్ని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ … చిన్నారులకు మెరుగైన వాతావరణంలో పూర్వ ప్రాథమిక విద్య, పోషకాహారం మరియు సంరక్షణ సేవలు అందించేందుకు ఆధునిక సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. సీఎస్ఆర్ భాగస్వామ్యంలో భాగంగా గ్రామంలో రాత్రివేళ వెలుతురు సౌకర్యం కోసం పూడికుప్పానికి 9 సోలార్ ఎల్ఈడీ లైట్లను కూడా సంస్థ అందించిందని తెలిపారు. నియోజకవర్గంలో విద్య, ఆరోగ్యం, తాగునీరు, పారిశుధ్యం మరియు గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు సీఎస్ఆర్ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమానికి పరిశ్రమల సహకారం తోడైతే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. చిన్నారుల కోసం మోడల్ భవనాన్ని నిర్మించి, లైట్లను అందించిన సెయింట్ గోబైన్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెయింట్ గోబైన్ సంస్థ ప్రతినిధులు, ఐసీడీఎస్ అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

తిరుపతి

పోయిన బంగారు ఆభరణాల బ్యాగ్‌ సురక్షితంగా స్వాధీనం

సీసీటీవీ ఆధారంగా బస్సును గుర్తించి బాధితురాలికి అప్పగించిన నాయుడుపేట పోలీసులు నాయుడుపేట ఆగస్టు 26 తిరుపతి జిల్లా నాయుడుపేట బస్టాండ్‌లో పోయిన విలువైన బ్యాగ్‌ను పోలీసులు చాకచక్యంగా స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు. నాయుడుపేటకు చెందిన గువ్వల దేవి బస్టాండ్‌లో తనకు చెందిన నాలుగు సవర్ల బంగారు ఆభరణాలు, రూ.1,000 నగదు, సెల్‌ఫోన్ ఉన్న బ్యాగ్‌ పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుపై నాయుడుపేట ఎస్సై ఎం. శివశంకరరావు వెంటనే స్పందించి సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. బస్టాండ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు బ్యాగ్‌ ఉన్న బస్సు నెల్లూరు వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. ఎస్సై శివశంకరరావు పర్యవేక్షణలో క్రైమ్‌ పార్టీ సిబ్బందిని అప్రమత్తం చేసి, నెల్లూరు పోలీసులతో సమన్వయం చేసుకుంటూ బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేశారు. ఈ క్రమంలో పోయిన బ్యాగ్‌ను పోలీసులు సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. అందులోని నాలుగు సవర్ల బంగారు ఆభరణాలు, రూ.1,000 నగదు, సెల్‌ఫోన్ తదితర వస్తువులను ఎలాంటి నష్టం లేకుండా బాధితురాలికి అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వేగంగా స్పందించి బ్యాగ్‌ను స్వాధీనం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై ఎం. శివశంకరరావుతో పాటు హెడ్‌ కానిస్టేబుల్ రాజు, కానిస్టేబుల్ పోలయ్యలను నాయుడుపేట డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

తిరుపతి

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయ అనుబంధ దేవస్థానమైన ఊరందరు గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో జరుగుతున్నాయి.*

ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు రాత్రి అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్న పరమ పవిత్రమైన నంది సేవ కార్యక్రమానికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు ఉభయదాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయానికి విచ్చేయగా, ఆలయ అధికారులు, అర్చకులు మరియు వేద పండితులు పూర్ణకుంభంతో, మంగళవాయిద్యాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివార్ల దివ్య మూర్తులను దర్శించుకుని, స్వామివారి కృపాకటాక్షాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ మండపంలో వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో,ఆశీర్వచనాలతో ఎమ్మెల్యే గారికి స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేసి ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి సేవలో తరించారు. Video Link: https://www.instagram.com/reel/DcTkh5HqlAU/?igsi=cmF1ZGRmYzdubjh5 Uploaded Video:

తిరుపతి

*వ్యాపార సంస్థల భద్రతపై ప్రత్యేక దృష్ట:*

*-తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు* తిరుపతి నగరంలోని వ్యాపార సంస్థల్లో దొంగతనాల నివారణకు బహుళస్థాయి భద్రతా చర్యలు చేపట్టాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశించారు. గోల్డ్ షాపులు, పాన్ బ్రోకర్లు, బ్యాంకులు, ఎలక్ట్రానిక్ షాపులు మరియు ఆటో డీలర్ల ప్రతినిధులతో ఒక ముఖ్యమైన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, వ్యాపారులు తమ సంస్థల రక్షణ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. కేవలం సాధారణ నిఘానే కాకుండా, కింది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు *ఆధునిక నిఘా:* సాధారణ సీసీటీవీలతో పాటు నైట్ విజన్ కెమెరాలను ఏర్పాటు చేయాలి. అత్యవసర సమయాల్లో హెచ్చరించే అలారాలు, సెన్సార్లు మరియు వాటికి నిరంతర పవర్ బ్యాకప్ వ్యవస్థలను అమర్చుకోవాలి.సైబర్ అప్రమత్తత భౌతిక దొంగతనాలతో పాటు, ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల వ్యాపారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి అని అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సుబ్బారాయుడు ఈ సమావేశంలో పిలుపునిచ్చారు.

తిరుపతి

కాపురానికి వచ్చిన రెండు రోజులకే భార్య హత్య..?????

*చీరలో మూటగట్టి బైక్‌పై తెచ్చిన ఉన్మాది!* సూళ్లూరుపేట ఆగష్టు 26 సూళ్లూరుపేట మండలం కోటపోలూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తికి, తడ మండలానికి చెందిన సంధ్యతో వివాహం జరిగింది. అయితే, గత నాలుగు నెలలుగా వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నారు. స్థానిక పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీ అనంతరం, రెండు రోజుల క్రితమే వీరిద్దరూ మళ్లీ కలిసి జీవించడం ప్రారంభించారు. భార్యతో కలిసి జీవించడం ప్రారంభించిన రెండు రోజులకే శ్రీనివాసులు ఈ కిరాతకానికి ఒడిగట్టాడు. గంజాయి మత్తులో ఉన్న శ్రీనివాసులు, రాత్రి సమయంలో పొలాల్లో తన భార్య సంధ్యను తీవ్రంగా చిత్రహింసలు పెట్టి దారుణంగా హత్య చేసిన ఘటన ఈరోజు అనగా బుధవారం ఉదయం వెలుగు లోకి వచ్చింది హత్య చేసిన అనంతరం, నిందితుడు సంధ్య మృతదేహాన్ని ఒక చీరలో మూటగట్టి, తన బైక్‌పై పెట్టుకుని ఇంటికి తీసుకువచ్చాడు. మృతదేహాన్ని ఆ స్థితిలో బైక్‌పై తీసుకురావడం చూసిన గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.