ఆత్మకూరులో జర్నలిస్టుల గర్జన.. హక్కుల కోసం గాంధీ విగ్రహానికి వినతిపత్రం!
ఆత్మకూరు: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో శుక్రవారం ఆత్మకూరులో జర్నలిస్టుల కోర్కెల దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా నాయకుల పిలుపు మేరకు ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు సోమా వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో జర్నలిస్టులు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహానికి డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు. మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక కేంద్ర చట్టం, మీడియా ఉద్యోగులకు నూతన వేజ్ బోర్డు, ప్రమాద బీమా పునరుద్ధరణ, హెల్త్ స్కీం అమలు, వెల్ఫేర్ ఫండ్ పునఃప్రారంభం, సీనియర్ పాత్రికేయులకు పెన్షన్, రైల్వే రాయితీ ప్రయాణ సదుపాయం పునరుద్ధరణ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టు నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

