Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Awareness

ప్రకాశం

*సున్నితమైన ఘటనలపై పూర్తి వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే స్పందించాలి – జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు*

*సున్నితమైన ఘటనలపై పూర్తి వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే స్పందించాలి – జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు* ఏదైనా సంఘటన జరిగినప్పుడు, దానికి సంబంధించిన అధికారుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే తదుపరి సంఘటనలకు వెళ్లాలని జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు సూచించారు. అలా కాకుండా పూర్తి వివరాలు తెలుసుకోకుండా వ్యవహరించడం వల్ల అనవసర సమస్యలు, గందరగోళం తలెత్తే అవకాశం ఉందని, తద్వారా ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టబడే అవకాశం ఉంటుందని అన్నారు. జిల్లా ఎస్పీ గారు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ నెల 10వ తేదీన మౌలాబి అనే మహిళ ఆత్మహత్య యత్నం చేసుకుని హైదరాబాద్‌లో మృతి చెందిన దురదృష్టకర సంఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ గారు వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సింగరాయకొండ చైతన్య నవోదయ పాఠశాలలో తౌషిక్ అనే 11 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై అప్పటి నుంచి పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టారని తెలిపారు. ఈ క్రమంలో అనేక మందిని విచారించి, వివిధ కోణాల్లో పరిశీలిస్తూ, పారదర్శకంగా మరియు పూర్తి జవాబుదారీతనంతో ప్రతి అంశంపై సమగ్ర వివరాలను సేకరించినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు. పారదర్శకంగా, పూర్తి జవాబుదారీతనంతో ప్రతి అడుగులోనూ ఎటువంటి దాపరికం లేకుండా తల్లిదండ్రులకు తెలియచేయటం, దర్యాప్తు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కేసు దర్యాప్తును స్థానిక ఎస్సైకి కాకుండా కందుకూరు సబ్‌ డివిజన్‌ సీఐ స్ధాయి అధికారికి అప్పగించడం జరిగిందన్నారు. దర్యాప్తులో భాగంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, పనిచేస్తున్న ఉపాధ్యాయులు, పాఠశాల పరిసర ప్రాంతాల్లోని వ్యక్తులు తదితరులను విచారించి, వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేయడం జరిగిందని తెలిపారు. తల్లిదండ్రులు గౌరవ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు కోర్టుకు హాజరై, కేసు దర్యాప్తులో ఇప్పటివరకు చేపట్టిన విచారణ, దర్యాప్తు చర్యలు, జరిగిన పరిణామాలకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు తెలియజేయడం జరిగిందని జిల్లా ఎస్పీగారు తెలిపారు. గౌరవ హై కోర్ట్ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు నిమిత్తం నెల్లూరు అడిషనల్‌ ఎస్పీ గారిని ప్రత్యేకంగా నియమించడం జరిగిందని, దర్యాప్తులో భాగంగా సెల్‌ఫోన్లు, సీసీ కెమెరాల ఫుటేజీ తదితరాలను స్వాధీనం చేసుకుని పరిశీలించడం జరిగిందన్నారు. అలాగే సంఘటన జరిగిన ప్రదేశంలో ఎఫ్‌ఎస్‌ఎల్‌ సిబ్బందితో శాస్త్రీయ ఆధారాలను సేకరించడం జరిగిందని తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో తౌషిక్ తల్లి ధర్నా చేయడంతో పాటు, పలుమార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిన సందర్భాల్లో పోలీసులు, అధికారులు ఆమెకు మనోధైర్యం కల్పించి, కౌన్సెలింగ్‌ అందించడం జరిగిందన్నారు. అయితే, ఆమె తరచూ పాఠశాలకు వెళ్లి మాట్లాడటం వల్ల అక్కడ చదువుతున్న విద్యార్థుల్లో అసౌకర్యం, ఆందోళన కలిగే పరిస్థితి ఏర్పడుతోందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. పలుమార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిన సందర్భాల్లో పోలీసులు వెంటనే ఆమెను రక్షించి, మానసికంగా ధైర్యం కల్పించే విధంగా అన్ని చర్యలు తీసుకున్నారని తెలిపారు. బాబు తల్లిదండ్రులు తీవ్ర మానసిక సంఘర్షణలో ఉంటారని, వారు అనుభవిస్తున్న బాధను మాటల్లో చెప్పలేమని అన్నారు. సంఘటన జరిగిన సమయంలో ఎటువంటి ఫిర్యాదు చేయకుండా పాఠశాలలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడం జరిగిందని, ఆ సమయంలో పరిస్థితిని అర్థం చేసుకుని పోలీసులు సంయమనంతో వ్యవహరించారని వివరించారు. తౌషిక్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో సుమారు 70 మంది విద్యార్థులను విచారించి, వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను కూడా విచారించి దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ గారు వివరించారు. కనిగిరిలో భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన సందర్భంలో పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను రక్షించడం జరిగిందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఆమె మానసిక ఆందోళన చెందుతున్న సమయంలో ఆమెకు అండగా నిలిచి, మానసికంగా ధైర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వార్తలు ప్రచారం చేయించడం, ఏదో ఒక సంఘటన జరిగినట్లు చూపించే ప్రయత్నం చేయడం వల్ల భవిష్యత్తులో అనుకోని పరిణామాలు ఎదురై అవకాశం ఉందని జాగ్రత వ్యవహరించాలన్నారు. బయట ఈ సంఘటనపై ప్రజా సంఘాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం చేస్తున్న విషయాలపై స్పందిస్తూ, పూర్తి వివరాలు, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం, వార్తలను ప్రచురించడం సరైన పద్ధతి కాదన్నారు. ఇదే కేసుకు సంబంధించి గౌరవ హైకోర్టులో విచారణ జరుగుతోందని తెలిపారు. స్కూల్ సంబందించిన వివరాలు హైకోర్టులో ఉందని, పూర్తీ సమాచారం విద్యాశాఖ ఉంటుందని తెలిపారు.ఈ కేసులో ప్రతి అంశాన్ని పోలీసు అధికారులు నిపుణులతో పరిశీలన చేయించి, లోతుగా విశ్లేషించి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. ఇది అత్యంత సున్నితమైన సమస్య అని, ఆత్మహత్యకు ప్రయత్నించిన తౌషిక్ తల్లి ఈ నెల 11వ తేదీన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో మృతి చెందడం అత్యంత బాధాకరమైన సంఘటన అని జిల్లా ఎస్పీ గారు అన్నారు.

ప్రకాశం

*ఒంగోలు జిజిహెచ్‌లో రూ. 23.75 కోట్లతో నిర్మించిన అత్యాధునిక క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం*

*ఒంగోలు జిజిహెచ్‌లో రూ. 23.75 కోట్లతో నిర్మించిన అత్యాధునిక క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం* ​ *కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్* ​ *వర్చువల్ విధానంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శ్రీ జే.పి. నడ్డా, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్* ​ *ఒంగోలులో ప్రత్యక్షంగా ప్రారంభించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్ధనరావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే శ్రీ బి. ఎన్.విజయ్ కుమార్ , జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి* రాష్ట్రంలోని పేద మరియు సామాన్య ప్రజలకు కార్పొరేట్ రంగానికి దీటుగా ఉచితంగా మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. శనివారం ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (GGH) ప్రాంగణంలో పీఎం-ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM) కింద రూ. 23.75 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ (CCB) ను మంత్రి గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధనరావు, సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బి.ఎన్.విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి తో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యక్షంగా ప్రారంభించారు. ​అంతకుముందు అమరావతి నుండి వర్చువల్ విధానం ద్వారా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జే.పి. నడ్డా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఈ క్రిటికల్ కేర్ సెంటర్లను లాంఛనంగా ప్రారంభించారు. ​ఈ సందర్భంగా మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాపాయంలో ఉన్న రోగులకు తక్షణమే అత్యున్నత స్థాయి అత్యవసర వైద్యం అందించడానికి ఈ క్రిటికల్ కేర్ సెంటర్లు ప్రారంభించడం ఒక శుభపరిణామమని తెలిపారు. ఒంగోలులో ప్రారంభించిన ఈ కేంద్రం మరో రెండు వారాల్లో ప్రజలకు పూర్తిస్థాయి వినియోగంలోకి వస్తుందని స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అన్ని సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ఈ సెంటర్ పేద ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా మారనుందన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదలకు మెరుగైన వైద్యం అందించడంపైనే ప్రధానంగా దృష్టి సారించారని, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఆపదలో ఉన్న అనేక పేద కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. ​వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన కూటమి ప్రభుత్వం, ఎన్టీఆర్ వైద్య సేవ మరియు సంజీవని పథకాల ద్వారా ప్రజల ఆరోగ్యానికి పూర్తి భద్రత కల్పిస్తోందన్నారు. అత్యవసర ఔషధాలు మరియు వైద్య సరఫరాల కోసం డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తూ వైద్య రంగంలో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టామన్నారు. గర్భిణులు, బాలింతల కోసం ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ ద్వారా మెరుగైన రవాణా సేవలు అందిస్తున్నామని తెలిపారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా కొండేపి మరియు అద్దంకి ప్రాంతాలలో నూతనంగా డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేశామని వెల్లడించారు. ​అదేవిధంగా ఆసుపత్రి వైద్యాధికారులు మరియు ఇంజనీరింగ్ విభాగం అందించిన సాంకేతిక వివరాలను మంత్రి గారు తెలియజేస్తూ, పీఎం-ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 60:40 కేంద్ర-రాష్ట్ర నిధుల భాగస్వామ్యంతో రూ. 23.75 కోట్ల వ్యయంతో (భవన నిర్మాణం రూ. 16.63 కోట్లు, పరికరాల నిమిత్తం రూ. 7.12 కోట్లు) ఈ 4 అంతస్తుల (G+3) సముదాయాన్ని 34,906 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించినట్లు వివరించారు. ఇందులో 18 పడకల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU), 16 పడకల ఐసోలేషన్ వార్డులు, 10 పడకల ఎమర్జెన్సీ వార్డు, డయాలసిస్, పోస్ట్ ఓపి మరియు మదర్-చైల్డ్ కేర్ పడకలతో సహా మొత్తం 50 పడకలు, 1 ట్రయేజ్ విభాగం ఏర్పాటు చేశామన్నారు. 2 అధునాతన ఆపరేషన్ థియేటర్లు, 2 లేబర్ డెలివరీ రూమ్‌లు, ఎక్స్-రే, అల్ట్రాసౌండ్ గదులు మరియు 20 మంది సామర్థ్యం కలిగిన 2 లిఫ్ట్‌లను ఈ భవనంలో అమర్చినట్లు వెల్లడించారు. ​ఒంగోలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (GGH)లో రోజువారీ రోగుల తాకిడి నిరంతరం పెరుగుతోందని మంత్రి తెలిపారు. 500 పడకల ఆసుపత్రి అయినప్పటికీ ప్రస్తుతం 700 మందికి పైగా ఇన్‌పేషెంట్లు, రోజుకు దాదాపు 1,600 మంది అవుట్‌పేషెంట్లు చికిత్స పొందుతున్నారన్నారు. రోగుల రద్దీని క్రమబద్ధీకరించడానికి ABDM ‘స్కాన్ & షేర్’ విధానం ద్వారా ఓపి వేచి ఉండే సమయాన్ని తగ్గించామని, మహిళా రోగులకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల వైద్యశాలకు వచ్చే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పారు. రోగులకు నాణ్యమైన చికిత్స అందించేందుకు ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ (Cath Lab), శ్వాసకోశ వ్యాధుల నివారణకు రూ. 15 లక్షల వ్యయంతో పల్మనాలజీ TFT పరికరం, రూ. 2 కోట్ల వ్యయంతో యూరాలజీ అత్యాధునిక డిజిటల్ యంత్రాలు, ఈఎన్టీ సౌండ్ ప్రూఫ్ ఆడియోమెట్రీ రూమ్, నవజాత శిశు సంరక్షణ కోసం కంగారూ మదర్ కేర్ (KMC) సేవలను సమకూర్చామని ఆయన వివరించారు. అలాగే పారదర్శకత కోసం డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ​ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధనరావు మాట్లాడుతూ, రూ. 23.75 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం కావడం ఒంగోలు ప్రజలకు దక్కిన గొప్ప వరమని కొనియాడారు. భవనాన్ని నాణ్యతతో వేగంగా నిర్మించిన కాంట్రాక్టర్ సంస్థ ‘మాస్టర్స్ కన్స్ట్రక్షన్స్’ ప్రతినిధులను ఆయన అభినందించారు. త్వరలోనే జిజిహెచ్ ప్రాంగణంలోని ‘గోపీ బ్లాక్’ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. ​కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా నిర్మించిన ఈ ఆధునిక క్రిటికల్ కేర్ సెంటర్ ద్వారా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ త్వరితగతిన ఉచిత అత్యవసర వైద్య సేవలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో అధికారులు, డాక్టర్స్, రిమ్స్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రకాశం

తల్లిదండ్రుల ఒత్తిడి – పిల్లలపై ప్రభావం

తల్లిదండ్రుల ఒత్తిడి – పిల్లలపై ప్రభావం పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలంటే.. ముందుగా వారి మనసును అర్థం చేసుకోవాలి డా. కె.టి.సి. పాపారాయుడు Psychologist & Career Mental Health Counsellor పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకోవడం సహజం. తమ పిల్లలు బాగా చదవాలి, మంచి మార్కులు సాధించాలి, మంచి ఉద్యోగం పొందాలి, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. అయితే పిల్లల మంచి కోసం తల్లిదండ్రులు చేసే ప్రయత్నం ఒక దశలో ఒత్తిడిగా మారినప్పుడు.. అదే వారి ఎదుగుదలకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులపై చదువు, మార్కులు, ర్యాంకులు, కెరీర్ ఎంపిక విషయంలో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. “ఇంకా ఎక్కువ మార్కులు రావాలి”, “పక్కింటి పిల్లవాడికి ఎక్కువ మార్కులు వచ్చాయి”, “నీ ఫ్రెండ్ ముందుకు వెళ్తున్నాడు.. నువ్వెందుకు వెనుకబడ్డావు?” అనే మాటలు తల్లిదండ్రులకు సాధారణంగా అనిపించినా, పిల్లల మనసులో మాత్రం అవి ఒత్తిడిని పెంచవచ్చు. పిల్లలను ప్రోత్సహించడం వేరు.. ఒత్తిడి చేయడం వేరు. “నువ్వు ఇంకా బాగా చేయగలవు” అని చెప్పడం ప్రోత్సాహం. అదే విషయాన్ని పదేపదే విమర్శిస్తూ, ఇతరులతో పోల్చుతూ చెప్పడం మాత్రం పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చు. ప్రతి విద్యార్థి సామర్థ్యం ఒకేలా ఉండదు. ఒకరు చదువులో రాణిస్తే మరొకరు క్రీడలు, కళలు, సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ లేదా సృజనాత్మకతలో ప్రతిభ చూపవచ్చు. అందుకే మార్కులను మాత్రమే పిల్లల ప్రతిభకు కొలమానంగా చూడకూడదు. పిల్లల కెరీర్ విషయంలో కూడా తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. తమకు నచ్చిన కోర్సును పిల్లలు చదవాలని కోరుకోవడం కంటే, పిల్లలకు ఏ రంగంపై ఆసక్తి ఉంది? వారి సామర్థ్యం ఏమిటి? వారి లక్ష్యం ఏమిటి? అనే విషయాలను తెలుసుకోవాలి. తల్లిదండ్రుల అనుభవం పిల్లలకు మార్గదర్శకంగా ఉండాలి కానీ.. వారి అభిరుచులను పూర్తిగా పక్కన పెట్టకూడదు. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినప్పుడు “ఎందుకు చదవలేదు?” అని ప్రశ్నించడం కంటే “ఎక్కడ ఇబ్బంది వచ్చింది? నీకు ఏ విధంగా సహాయం చేయాలి?” అని అడగడం పిల్లలకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది. పిల్లలు తమ సమస్యలను తల్లిదండ్రులతో స్వేచ్ఛగా చెప్పగలిగే వాతావరణం ఇంట్లో ఉండాలి. అలాగే పిల్లలను ఇతరులతో పోల్చడం పూర్తిగా తగ్గించాలి. ప్రతి పిల్లవాడికీ తనకంటూ ప్రత్యేకమైన వేగం, సామర్థ్యం, ఆసక్తి ఉంటాయి. నిన్నటి పిల్లవాడితో కాకుండా.. నిన్నటి తనతోనే ఈరోజు పిల్లవాడు మెరుగ్గా ఉండేలా ప్రోత్సహించడం తల్లిదండ్రుల బాధ్యత. చదువుతో పాటు పిల్లలకు విశ్రాంతి, ఆటలు, అభిరుచులు, స్నేహాలు, కుటుంబంతో గడిపే సమయం కూడా అవసరం. క్రమశిక్షణ పేరుతో నిరంతరం ఒత్తిడి చేయడం కంటే, బాధ్యతను అర్థం చేసుకునేలా చేయడం ఉత్తమమైన మార్గం. పిల్లల ప్రవర్తనలో లేదా భావోద్వేగాల్లో గణనీయమైన మార్పులు కనిపించినప్పుడు “వయసు వల్లే” అని నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. అవసరమైతే ఉపాధ్యాయులు, కౌన్సెలర్లు లేదా మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలి. పిల్లల భవిష్యత్తును నిర్మించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో గొప్పది. అయితే పిల్లలపై ఒత్తిడి పెంచడం ద్వారా కాదు.. వారిపై నమ్మకం ఉంచడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. పిల్లలకు మనం ఇచ్చే గొప్ప బహుమతి ఎక్కువ మార్కులు కాదు.. తమపై తమకు నమ్మకం. పోల్చడం కంటే ప్రోత్సహిద్దాం.. ఆదేశించడం కంటే మాట్లాడుదాం.. విమర్శించడం కంటే అర్థం చేసుకుందాం. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలంటే ముందుగా వారి మనసును గెలుచుకుందాం.

ప్రకాశం

పున్నమి న్యూస్ కథనానికి స్పందన ఫిర్యాదు చేసిన వెంటనే విద్యుత్ అధికారులు స్పందన – అక్రమ విద్యుత్ వినియోగంపై చర్యలు

పున్నమి న్యూస్ కథనానికి స్పందన ఫిర్యాదు చేసిన వెంటనే విద్యుత్ అధికారులు స్పందన – అక్రమ విద్యుత్ వినియోగంపై చర్యలు (హనుమంతుని పాడు పున్నమి ప్రతినిధి) హనుమంతునిపాడు మండలంలో అక్రమంగా విద్యుత్ వినియోగం జరుగుతోందని, దీనిపై సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం ఇటీవల పున్నమి న్యూస్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, 7111205000105 నంబర్ గల విద్యుత్ మీటర్ కాటినేని పాపయ్య పేరు మీద ఉంది. ఆయన అనుమతి లేకుండా ఈ కనెక్షన్ నుంచి విద్యుత్ తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా, మూలే శ్రీనివాసులు అనే వ్యక్తి బుసిరెడ్డి మాల్యాద్రి పేరుతో అగ్రిమెంట్ రాసుకుని, ప్రభుత్వ విద్యుత్ స్తంభం నుంచి నేరుగా విద్యుత్ తీసుకోవడంతో పాటు, 7111205000105 నంబర్ విద్యుత్ కనెక్షన్ నుంచి కూడా విద్యుత్ తీసుకుని ఒక షాప్‌కు కనెక్షన్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై పున్నమి న్యూస్‌లో కథనం ప్రచురితమైన వెంటనే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, సంబంధిత అంశాన్ని పరిశీలించి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. ఆ షాపు లో ఉన్న దొంగ కనెక్షన్ ను కూడా తొలగించారు. వారిపై చర్యలు కూడా తీసుకున్నారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విద్యుత్ అక్రమ వినియోగానికి సంబంధించిన సమస్యను పరిష్కరించిన విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదుదారు కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ మీటర్ ఇతరుల పేరుపై ఉన్న సందర్భంలో, సంబంధిత వ్యక్తి అనుమతి లేకుండా విద్యుత్ వినియోగించడం, ప్రభుత్వ విద్యుత్ స్తంభాల నుంచి నేరుగా కనెక్షన్లు తీసుకోవడం వంటి అంశాలపై అధికారులు నిరంతరం నిఘా ఉంచి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. Uploaded Video:

ప్రకాశం

*అంగన్‌వాడీ, పాఠశాలలు, వసతిగృహాల్లో మధ్యాహ్న భోజనం, రేషన్ పంపిణీ పకడ్బందీగా అమలు చేయాలి: ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీ విజయ్ ప్రతాప్ రెడ్డి* .

రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించడంతో పాటు చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ పకడ్బందీగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీ విజయ్ ప్రతాప్ రెడ్డి ఆదేశించారు. బుధవారం, మార్కాపురం జిల్లాలోని కనిగిరి లోని అంగన్వాడీ కేంద్రాలను, హాస్టల్ లు, పాఠశాలలను ఆకస్మికంగా తనికి చేశారు, అనంతరం ప్రకాశం జిల్లాలోని మర్రిపూడి మండలంలోని గార్లపేట ఎస్సీ కాలనీ, ఓసీ కాలనీ, వేమవరం, మర్రిపూడి ఎస్సీ కాలనీలలోని అంగన్‌వాడీ కేంద్రాలను, గార్లపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, చౌక ధరల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా కూచిపూడి హైస్కూల్‌ను ఆయన సందర్శించిన సమయంలో, అక్కడ మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన చైర్మన్, స్వయంగా విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. విద్యార్థులు కూడా ఆహారం బాగుండటం లేదని చెప్పడంతో తీవ్రంగా పరిగణించిన ఆయన, వెంటనే మర్రిపూడి మండల తహసీల్దార్‌తో ఫోన్లో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై త్రిమెన్ కమిటీ ద్వారా తక్షణమే విచారణ జరిపించి, బాధ్యులైన వంట సిబ్బందిని తొలగించి నూతన వంట వర్గాన్ని నియమించాలని స్పష్టం చేశారు. అనంతరం కూచిపూడిలోని చౌక ధరల దుకాణాన్ని, రావెళ్లవారిపాలెంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) కూడా ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల సందర్భంగా వివిధ ప్రభుత్వ వ్యవస్థల్లో అధికారులు, సిబ్బంది చేపట్టాల్సిన తనిఖీల వివరాలను చైర్మన్ సుదీర్ఘంగా వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహార నాణ్యతను ముఖ్యంగా పరిశీలించాలని సూచించారు. అక్కడ బియ్యం, పప్పులు, గుడ్లు, పాలు, బాలామృతం నిల్వల నమోదు పక్కాగా ఉండాలని, గడువు ముగిసిన సరుకులు లేకుండా చూడడంతో పాటు పిల్లల బరువు, ఎత్తు కొలిచే పరికరాల పనితీరు, కేంద్రాల పరిశుభ్రత మరియు తాగునీటి సదుపాయాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలన్నారు. అదేవిధంగా చౌక ధరల దుకాణాల్లో ఈ-పోస్ (e-Pos) యంత్రాల పనితీరును, ఎలక్ట్రానిక్ తారాజుల ప్రామాణికతను నిరంతరం పరిశీలించాలని తెలిపారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం నాణ్యత, బస్తాల బరువు, నిల్వల రికార్డులు మరియు కార్డుదారుల బయోమెట్రిక్ వివరాలను సరిచూసుకోవాలని, కార్డుదారులకు ఎటువంటి అవకతవకలు లేకుండా రాయితీ బియ్యం అందేలా చూడాలని ఆదేశించారు. మరోవైపు పాఠశాలలు మరియు సంక్షేమ హాస్టళ్లలో రోజువారీ మెనూ ప్రకారం వేడివేడి నాణ్యమైన భోజనం అందించాలని, వంటశాలల పరిశుభ్రతతో పాటు వంటకు ఉపయోగించే నూనె, పప్పులు, ఐయోడైజ్డ్ ఉప్పు వంటి సరుకులు ఏజీమార్క్ నాణ్యత కలిగి ఉన్నాయో లేదో తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు వడ్డించే ముందు ఉపాధ్యాయులు భోజనాన్ని రుచి చూసే ప్రక్రియతో పాటు వంట సిబ్బంది పరిశుభ్రతా నియమాలు పాటిస్తున్నారా లేదా అనేది నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. KGBV మరియు ఇతర సంక్షేమ వసతిగృహాల్లో అల్పాహారం, భోజన నాణ్యత, స్టాక్ రిజిస్టర్లు, డైనింగ్ హాల్స్ మరియు మరుగుదొడ్ల పరిశుభ్రతను కూడా క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన ఆహారంతో పాటు మెరుగైన విద్యను అందించేందుకు కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తోందని చైర్మన్ తెలిపారు. ఈ పథకాల ఫలాలు విద్యార్థులకు నేరుగా అందాలని, ఎటువంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదివి, సాధారణ విద్యతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలు మరియు ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం పెంచుకుని ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకోవాలని శ్రీ విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకాంక్షించారు. • వేమవరం అంగన్వాడీ కేంద్రం లో ఇండక్షన్ స్టవ్ ,మెటీరియల్ పెట్టుకోవటానికి టేబుల్ ఏర్పాటు కోసం సొంత నగదు 2 వేల రూపాయలు అంగన్వాడీ టీచర్ కి అందించారు. •రావెళ్ళవారిపాలెం కేజీబీవీ లో పదవ తరగతిలో 577 మార్కులు సాధించిన విద్యార్థికి 2 వేల రూపాయలు ఇచ్చి మంచి చేతి గడియారం కొనిపించాలన్నారు. Uploaded Video: