ఎలైట్ క్రికెట్ లీగ్ (ఈసీఎల్) సీజన్-2″ ట్రోఫీ ఆవిష్కరణ
రాష్ట్ర రవాణా క్రీడ యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విశాఖపట్నం, విశాఖ వేదికగా చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక ‘ECL సీజన్ 2’ క్రికెట్ టోర్నమెంట్ త్వరలో జరగనుందని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మండేపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి ప్రకటించారు. విశాఖలోని ఒక హోటల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి మంత్రి పాల్గొని, ఈ టోర్నమెంట్ ట్రోఫీని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో ప్రజలను కాపాడే సైనికుల సహాయార్థం ఈ నెల 27, 28 తేదీలలో పీఎం పాలెం ADCA, VDCA స్టేడియంలో ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఒక గొప్ప ఆశయంతో జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్‌ను విజయవంతం చేసేందుకు ప్రజలు, వాణిజ్య సంస్థలు భాగస్వాములు కావాలని, వచ్చే 25 రోజుల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో క్రికెట్ అనేది ఒక ఎమోషన్ అని, అందుకే ఈ సేవా కార్యక్రమానికి దీనిని వేదికగా ఎంచుకున్నరని తెలిపారు. మొత్తం 6 టీమ్‌లు తలపడే ఈ రెండు రోజుల టోర్నమెంట్‌లో సుమారు 35 నుండి 40 మంది ఎమ్మెల్యేలు, 15 మంది రాష్ట్ర మంత్రులతో పాటు సినీ, టీవీ ఆర్టిస్టులు, ప్రముఖ డాక్టర్లు క్రీడాకారులుగా పాల్గొంటారని చెప్పారు. టోర్నమెంట్ స్పాన్సర్‌షిప్ కోసం వ్యాపారవేత్త మారుతి 10 లక్షల ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్న మంత్రి.. ఈ ఈవెంట్ ద్వారా సేకరించే కోటికి పైగా నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ECL చైర్మన్ చామల ఉదయ్ చందర్ రెడ్డి, నటుడు & ECL డైరెక్టర్ రవీందర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సామ రాజేందర్ రెడ్డి, ప్రముఖ నటుడు ప్రభాకర్, పున్రెడ్డి శివారెడ్డి, చారుణ్య తదితరులు పాల్గొన్నారు.


