ఆత్మకూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడు దుర్మరణం
నెల్లూరు జిల్లా, పున్నమి (ప్రతినిధి) విజయ్
ఆత్మకూరు పట్టణంలోని బస్టాండ్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నాగేంద్రపురం గ్రామానికి చెందిన కలమల సుబ్బారెడ్డి (80) అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం మేరకు, సుబ్బారెడ్డి రోడ్డు దాటుతుండగా సోమశిల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ సయ్యద్ కరిముల్లాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి నిరసన చేపట్టడంతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న సీఐ గంగాధర్, ఎస్ఐ జంపాని కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ విషాద ఘటనతో ఆత్మకూరు పట్టణంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.


