వేమిరెడ్డి దంపతులకు అనిల్ వార్నింగ్
నెల్లూరు రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం భగ్గుమంది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులపై మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డబ్బుతో రాజకీయ వ్యవస్థను శాసించవచ్చనే అహంకారాన్ని తగ్గిస్తామని హెచ్చరించారు. తమపై కేసులు నమోదు చేసినా, ఇళ్లపై దాడులు చేయించినా వెనక్కి తగ్గేది లేదన్నారు. వేమిరెడ్డి దంపతుల రాజకీయ, ఆర్థిక వ్యవహారాలను ప్రజల ముందు ఉంచుతామని ప్రకటించారు. క్వార్ట్జ్ వ్యవహారాలు, సీఎస్‌ఆర్ నిధుల వినియోగంపై స్పష్టమైన సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శలకు పోలీసు కేసులతో సమాధానం ఇవ్వడం సరికాదని, జిల్లా ఎస్పీ శాంతిభద్రతలపై దృష్టి పెట్టాలని సూచించారు. తన అనుచరుడు శ్రవణ్‌పై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. గతంలో తమపై విమర్శలు వచ్చినా దాడులు, కేసులకు పాల్పడలేదని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో వేమిరెడ్డి దంపతులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అనిల్ హెచ్చరించారు. ఈ ఆరోపణలపై వేమిరెడ్డి వర్గం స్పందించాల్సి ఉంది.



