Tuesday, 14 July 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్

“కష్టకాలంలో అండగా ఉంటాం అంటున్న ఉద్యోగ సంఘాలు “

నెల్లూరు, 26.04.2020, (పున్నమి ప్రతినిధి, సి.ఎస్.రావు) “కష్టకాలంలో అండగా ఉంటాం అంటున్న ఉద్యోగ సంఘాలు ” ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాయకులు, అధికారులు ,ఉద్యోగులు సచివాలయ ఉద్యోగుల సహకారంతో నిర్వహిస్తున్న ఈసేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు డైరెక్టర్ తమ్మినేని .పాండు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గీతా మయి వృద్ధుల ఆశ్రమం ,బాలాజీ నగర్ నెల్లూరు నందు 100 మంది చిన్నారులకు ,వృద్ధులకు అన్నదానం నిర్వహించడంతోపాటు, మాస్కులు, బిస్కెట్స్ చేయడం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంను ఉద్దేశించి చేజర్ల సుధాకర్ రావు ఏపీ జి ఈ ఏ జిల్లా నాయకులు మాట్లాడుతూ కరోనా కోవిద్ 19 లాక్ డౌన్ సందర్భంగా అన్ని వ్యవస్థలు స్తంభించిపోయి సాధారణ జనం ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకునేందుకు ,ఉద్యోగుల సమన్వయంతో ఈ సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ,ఈ కార్యక్రమం ద్వారా ఈ రోజు గీతామయి వృద్ధులు- చిన్నారుల ఆశ్రమంలో అన్నదానం, మాస్క్ లు పంపిణీ ,బిస్కెట్స్ అందజేసేందుకు శ్రీ పోలుపోగు. నరసింహారావు ,సూపరిండెంట్, పే మరియు అకౌంట్స్ ఆఫీస్, వర్క్స్ అకౌంట్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఒంగోలు వారు ముందుకు వచ్చి తమవంతు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నెల్లూరు జిల్లా శాఖ తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నారు, ఆకలితో అలమటిస్తూ చెప్పుకోలేని దుస్థితి, దీన స్థితిలో అనేక మంది ఉన్నారని వారందరినీ కొంతమేరకు ఆదుకునేందుకు ఆకలి తీర్చేందుకు, అధికారులు ఉద్యోగులు తరలి ముందుకు రావాలని ఆయన అన్నారు ‌ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నాయకులు ఏనుగు రమణారెడ్డి ,పులి సతీష్, లక్ష్మీనారాయణ, , ఏవి. సురేష్ , చేజర్ల.తేజ విఆర్ఓ,రంజిత్, నాగరాజు, ఎస్ వి సుబ్బారెడ్డి, కిరణ్, సుధాకర్ రెడ్డి ,ఎపిజి ఈ ఏ మహిళా విభాగం జిల్లా చైర్మన్ టి. సౌందర్య జిల్లా కన్వీనర్ జిఎస్ఎల్. సౌజన్య కో చైర్మన్ ఆర్. ఇందిర, వైస్ చైర్మన్ సునీత తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు

ప్రసిద్ధ చారిత్రక క్షేత్రం అలఘమల్లారి దేవాలయం

వెలుగోటి వారి పాలనలో ప్రసిద్ధికెక్కిన మన్నారు పోలూరు శ్రీకృష్ణుని ఆలయం ( పున్నమి ప్రతినిధి. షేక్. రసూల్ అహమద్ ) :  బ్రహాండ పురాణకాలములో మణిమంటపక్షేత్రముగా, నూట ఎనిమిది దివ్య తిరుపతులలో ఒకటిగా ప్రఖ్యాతిగాంచిన  పుణ్యక్షేత్రం అలఘమల్లారి కృష్ణస్వామి దేవాలయం. ఈ దేవాలయం నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటకు దగ్గరలో ఉన్న మన్నారుపోలూరు అనే గ్రామములో వెలసి వుంది. సంపదలకు నిలయంగా ఉండే ప్రతి గుడికి ఓ పురాణగాథ ఉన్నట్టే ఈ గుడికి కూడా ఓ పురాణం ఉంది. ద్వాపరయుగంలో సత్రాజిత్తుడనే రాజు తన తపోబలముచే సూర్యుని వలన శ్యమంతకమణిని సంపాదించెను. శ్రీకృష్ణుడు ఆ మణి  మహాత్యమును తెలిసుకొని దానిని తనకివ్వవలసినదిగా  సత్రాజిత్తు రాజును కోరగా , అందుకు ఆరాజు నిరాకరించెను. తరువాత ఒకనాడు సత్రాజిత్తుని తమ్ముడగు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్లగా అడవిలో ఒక సింహము ప్రసేనుని చంపి ఆ మణిని తీసుకొని వెళ్లుచుండగా, ఆ ప్రాంతంలో తపస్సు చేసుకొంటున్న జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి మణిని తీసికొనివచ్చి తన కుమార్తె ఐన జాంబవతికిచ్చెను. కానీ మోసముచే శ్రీకృష్ణుడే ప్రసేనుని వధించి శమంతక మణిని దొంగతనంగా తీసుకున్నాడని లోకములో అపవాదు కలిగేను.కొంత కాలము తరువాత ఒకనాడు దండకారుణ్యమునకు వేటకు వచ్చిన కృష్ణుడు జాంబవతి వద్దనున్న శమంతకమణి చూసి, తనపైఉన్న అపవాదును పోగొట్టుటకు , త్రేతాయుగములో శ్రీరామావతారములో జాంబవంతుడికిచ్చిన వరమును చెల్లించుటకు గాను శ్రీకృష్ణుడు జాంబవంతునితో 18 రోజులు మల్లయుద్దము చేసి జాంబవంతుడిని ఓడించి శ్యమంతకమణితో పాటు జాంబవతిని కూడా వివాహమాడెను. అందువలన ఇక్కడ వెలసివున్న కృష్ణస్వామికి అలఘమన్నారి  కృష్ణస్వామి అను పేరు కలిగినట్టుగా ప్రచారంలో ఉంది. ఈ క్షేత్రపాలకుడు జాంబవంతుడు. కృష్ణుడు మణిని సత్రాజిత్తునికిచ్చి తనపై ఉన్న అపవాదును పోగొట్టుకొనెను. అప్పుడు సత్రాజిత్తు శ్రీకృష్ణుని మెచ్చుకొని తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహము చేసి ఆ మణిని తిరిగి శ్రీకృష్ణుడికి కానుకగా ఇచ్చెను. ఇక చారిత్రకంగా ఈ గ్రామము ఒకప్పుడు వడ్డెరాజులకు ముఖ్యపట్టణంగా ఉండింది. 12వ శతాబ్దములో మనుమసిద్ధి రాజుగారి బంధువు తిక్కరాజు ఉత్సవకాలములో ప్రత్యేక వసతులు కల్పించినట్లు ఈ ఆలయంలో శిలాశాసనము వుండింది. ప్రస్తుతం అది కనపడుటలేదు.కల్నల్ మేకంజి కైఫీయత్తులో ఈ దేవాలయ స్థల పురాణం రాయబడింది. దేవాలయం వెనక వైపు రాజుల కాలంనాటి  శిధిల కోట ఆనవాళ్లు ఉన్నాయి.  వెంకటగిరి రాజుల కాలంలో ఈ దేవాలయం  మహోన్నత స్థాయికి చేరింది. వెంకటగిరి రాజులు  ఈ దేవాలయ నిర్వహణకు 5 గ్రామాలతోపాటు వేల ఎకరాలు దానంగా ఇచ్చారు. వెలుగోటివారు మన్నారు పోలూరును తూర్పు దక్షిణ రాజ్యానికి  తమ ముఖ్య కేంద్రంగా వాడుకొన్నారు. ఇక్కడ అధిక సంఖ్యలో దేవదాసీలు ఆలయానికి అనుబంధంగా పనిచేసేవారు. వెంకటగిరి రాజాల దర్బారులో, అలాగే సంస్థానానికి చెందిన  ప్రతి ఉత్సవాల్లో మన్నారు పోలూరు దేవాసీలు ఉండేవారు. అత్యంత ఆకర్షణీయంగా ఉండే  మన్నారుపోలూరు దేవదాసీల కోసం వెంకటగిరి రాజుల యొక్క అతిధులు అధికారులు ఆఖరికి పామర జనాలు కూడా ఎగబడేవారు. పెద్ద ఎత్తున రంగమంటపాలు వీరికోసం ఉండేవి. దేవదాసీలు దేవాలయంపై వచ్చే ఆదాయం పైన ఆధారపడి వీరు బతికేవారు. జమీందారి రద్దు తర్వాత దేవదాసీల జీవితం దుర్భర స్థితిలోకి నెట్టివేయబడింది. ఇక దేవాలయంలోని శిల్ప కళ ద్రావిడ శైలిలో కట్టబడింది . ప్రతి శిల్పం ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. నవరసాలకు ప్రతిబింబంగా ఇక్కడి శిల్పకళావైభవం వర్ధిల్లుతోంది. ఇందుకు ఉదాహరణగా గర్వభంగము అయిన గరుత్మంతుడు రోధిస్తున్నట్టు విగ్రహ కనులనుండి నీరుకారుతున్నట్టుగా గోచరిస్తుంది. ఇలా ప్రతి శిల్పం ప్రత్యేకలక్షణము కలిగి ఈ దేవాలయం భారతదేశములో ప్రసిద్ధ పుణ్యక్షేత్రములో ఒకటిగా విరాజిల్లుతోంది.

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు

కరోనా వైరస్ కంటే ముందే ఆకలి అనే వైరస్ ప్రజలను చంపేస్తుందా ?

( పున్నమి ప్రతినిధి ) : కరోనా దెబ్బకు ప్రపంచమంతా ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది, తీవ్ర దుర్భిక్షంలోకి దేశాలు నెట్టివేయబడుతున్నాయి. కెన్యా రాజధానిలోని అతిపెద్ద మురికివాడలో ప్రజలు ఆహారంకోసం జరిగిన ఘర్షణలో కొందరు  గాయపడ్డారు మరియు ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. భారతదేశంలో, వేలాది మంది కార్మికులు రోజుకు రెండుసార్లు రొట్టె మరియు వేయించిన కూరగాయల కోసం వరుసలో ఉన్నారు. కొలంబియా అంతటా ఆకలితో ఉంటున్నామని తెలియడానికి, పేద కుటుంబాలు వారి కిటికీలు మరియు బాల్కనీల నుండి ఎర్రటి దుస్తులు మరియు జెండాలను వేలాడదీసి తాము ఆకలితో ఉన్నామనడానికి సంకేతంగా వేలాడదీస్తున్నారు.  “మాకు డబ్బు లేదు, ఇప్పుడు మనం బ్రతకాలి” అని పౌలిన్ కరుషి అన్నారు ఆమెకు నైరోబిలోని ఒక ఆభరణాల వ్యాపారంలో ఉద్యోగం పోయింది, ఆమె బిడ్డ మరియు మరో నలుగురు బంధువులతో కలిసి ఇరుకైన  రెండు గదులలో నివసిస్తుంది. తినడానికి ఏమి లేదు అంటే కరోనావైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి ఆకలిని తెచ్చిపెట్టింది. జాతీయ లాక్‌డౌన్లు మరియు సామాజిక-దూర చర్యలు, పని మరియు ఆదాయాలను ఎండబెట్టాయి,  వ్యవసాయ ఉత్పత్తి మరియు సరఫరా మార్గాలకు అంతరాయం కలిగించాయి. దీంతో లక్షలాది మంది ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ను ధనవంతులు మరియు పేదలు ఇద్దరిని అనారోగ్యానికి గురిచేసి కొన్నిసార్లు సమానత్వం చూపించింది. కానీ ఆహారం విషయానికి వస్తే సమరూపం చూపించలేదు.పేద, ధనిక దేశాల మధ్య అంతరం అలాగే ఉంది, ఆకలితో ఉన్న అవకాశాన్ని ఎదుర్కొంటున్నప్పుడు క్లాసిఫికేషన్ మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆశా జాఫర్ అనే  స్వచ్ఛంద సేవకుడు నైరోబి మురికివాడలోని కుటుంబాలకు ప్రాణాంతక తొక్కిసలాట తరువాత ఆహారాన్ని తీసుకువచ్చాడు. తరగతి విభజనపై ఉన్న అడ్డు తెరను వెనక్కి లాగడం ద్వారా  ఈ దేశంలో ఎంత లోతైన  అసమానంగా ఉందో బహిర్గతం చేస్తోంది. ఇలాంటి సంఘటనలు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే, 135 మిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు, కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి దీన్ని రెట్టింపు చేయవచ్చని  ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం చీఫ్ ఎకనామిస్ట్ ఆరిఫ్ హుస్సేన్ అన్నారు. మొత్తంగా, సంవత్సరాంతానికి 265 మిలియన్ల మంది ప్రజలు ఆకలి అంచుకు నెట్టబడతారని చెప్పారు. మేము ఇంతకు ముందెన్నడూ చూడని మహా ఆహార సంక్షోభం అని హుస్సేన్ అన్నారు. ప్రపంచం ఇంతకు ముందు తీవ్రమైన ఆకలి సంక్షోభాలను ఎదుర్కొంది, కానీ అవన్నీ ప్రాంతీయమైనవి మరియు ఒక కారకం లేదా మరొక కారణంతో సంభవించాయి.  తీవ్రమైన వాతావరణం, ఆర్థిక మాంద్యాలు, యుద్ధాలు లేదా రాజకీయ అస్థిరతతో  ఈ ఆకలి సంక్షోభం ప్రపంచవ్యాప్తమని, మరియు కరోనావైరస్ మహమ్మారితో  ముడిపడివున్న అనేక కారణాల వల్ల మరియు ఆర్ధిక క్రమం యొక్క అంతరాయం కారణంగా ఈ ఆహార సంక్షోభం సంభవిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే  లెక్కలేనన్ని మిలియన్ల మందికి ఆదాయంలో అకస్మాత్తుగా నష్టం, చమురు ధరల పతనం,  పర్యాటక రంగం నుండి కఠినమైన కరెన్సీ కొరత, విదేశీ కార్మికులు ఇంటికి పంపించడానికి ఆదాయాలు లేకపోవడం, వాతావరణ మార్పు, హింస, జనాభా తొలగింపులు మరియు మానవతా విపత్తులు వంటి కొనసాగుతున్న సమస్యలు  లేదా సామాజిక భద్రత లేకపోవడం, ఆహార ధరల పెరుగుదల, వంటి కారణాలతో ప్రపంచం ఆహార కొరతగా దిశగా అడుగులు వేస్తుంది.  ఇప్పటికే, హోండురాస్ నుండి ఆఫ్రికాకు  ఆఫ్రికానుండి భారతదేశానికి ఆహార సంక్షోభం పెద్దముప్పుగా పరిణమించే అవకాశముంది. వైరస్ వల్ల దోపిడీ విచ్ఛిన్నమైంది వేతనాలు ఎండిపోయినందున, ప్రపంచవ్యాప్తంగా సుడాన్ మరియు జింబాబ్వే వంటి నగరాలను ప్రజలు విడిచిపెట్టినందుకు మిగతా దేశాల ఆర్ధికవ్యవస్థలు మరింతగా క్షీణించాయి. మిలియన్ల ప్రజలు ఇంటికి నడవడం,ఇతర ప్రదేశాలకు బయలుదేరడం లేదా ఆగిపోవడం లాంటి బీభత్సమైన వాతావరణం కనిపిస్తుంది. ఇరాన్ వంటి ఇస్లామిక్ దేశాలు పోషకమైన భోజనం కోసం ఎక్కువగా చమురును ఉపయోగించారు. ఇది కూడా సంక్షోభానికి కారణమైంది. దీనికి భిన్నంగా ఇండియా తమ విశిష్టతను ఆహారం మరియు మెడిసిన్ పదాల్లో చూపిస్తుంది. అయితే వాస్తవం ఇంకోలాఉంది దేశం మొత్తం వలస, సంచార జాతులు తీవ్ర ఆకలితో చిక్కుకు వున్నారని మాధ్యమాలు ఘోషిస్తున్నాయి, దేశరాజధాని ఐన ఢిల్లీలోవలసకార్మికులు ఆహార సంక్షోభంలో చిక్కుకున్నారనే ప్రకటనలు కనిపిస్తున్నాయి. అయితే అలాంటిది ఏదినిజం కాదని ఢిల్లీ వర్గాలు చెపుతున్నాయి. గణాంకాలు ఎలా ఉన్న “కరోనా వైరస్ కంటే ముందే ఆకలి అనే వైరస్ ప్రజలను చంపేస్తుందా,” అన్న సందేహాలు నేటి నాగరిక సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి.

Featured ఆంధ్రప్రదేశ్ వీడియోలు

లక్ష్మణరేఖ షార్ట్ ఫిల్మ్ బిగ్ మెసేజే ఇచ్చింది..

ప్రముఖ సినీ మాటల రచయిత మరియు నెల్లూరీయుడు శ్రీ పి.రాజేంద్రకుమార్ సమర్పణలో,శ్రీ చేగొండి హరిరామ జోగయ్య గారి నేతృత్వంలో ,శ్రీ నందమూరి తారకరామారావు ఎడిటింగ్ తో ఈ కరోనా లాక్ డౌన్ లో మనం ఇళ్ళలోనే ఉండి లక్ష్మణ రేఖ దాటకుండా ఉండాలన్న భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్రమోదీ పిలుపు మేరకు ఉత్తేజితుడైన ఓ బాబు తన హోంవర్కు చేసుకుంటూ టీవీ లో మోదీ ఉపన్యాసం విని చాక్పీసు తీసుకొని తన అపార్ట్మెంట్ ప్రధాన గేటువద్ద గీతగీచి…ఇది మన మోడీతాతయ్య చెప్పిన లక్ష్మణరేఖ… మనం మన ఇళ్ళలోనే ఉందాం. మనమంతా క్షేమంగా ఉందాం…జైహింద్…అంటూ అనంతరం లక్ష్మణరేఖ టైటిల్ భారతదేశం…జాతీయ పతాకం…లక్ష్మణరేఖ భగ్గుమంటూంటే కరోనా ని అడ్డుకొంటున్నతీరు…రాజేంద్రకుమార్ అత్యధ్భుతంగా చిన్న నిడివిలోనే పెద్ద సందేశాన్ని ఇచ్చారు. చి.ప్రఖ్యాత్ శౌర్య ఐదేళ్ళ వయస్సులో చక్కగా అభినయం చేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సెలెన్సు మణికొండలో చదువుతున్న ప్రఖ్యాత్ శౌర్య (ప్రత్యూష రవిచంద్ర ఏకైక కుమారుడు)(మన నెల్లూరీయుడు న్యాయవాది జీవి నాగరాజరావు సుధారాణి ల మనవడు) ఇంతటి చక్కని సందేశాన్ని ఇచ్చే షార్ట్ ఫిల్మ్ టైటిల్ డిజైను శ్రీ నితీష్ కళ్యాణ్ చేశాడు. మంచి సందేశం మిళితమైయుంది. ఈ షార్ట్ ఫిల్మ్ నిర్వహించిన పీ.రాజేంద్రకుమార్ అభినందనీయుడు. ఈ షార్ట్ ఫిల్మ్ మంచి ఖ్యాతిపొందాలనీ..తదనుగుణంగా అవార్డు పొందాలని పున్నమి కోరుకుంటుంది.

Featured ఆంధ్రప్రదేశ్

జిల్లాకు 2వేల ట్రూనాట్ మిషన్సు : జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు

జిల్లాకు 2వేల ట్రూనాట్ మిషన్సు రావడం జరిగిందని , వీటిని హాట్ స్పొట్ లలో వినియోగించనున్నట్లు జిల్లా కలెక్టర్ యం.వి.శేషగిరి బాబు తెలిపారు. గురువారం సాయంత్రం జడ్పీ ఆవరణలోని డిస్ట్రిక్ ఎమర్జెన్సీ ఆపరేటింగ్ సెంటర్ వద్ద జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లా కు 2 వేల ట్రూనాట్ టెస్టింగ్ ఎక్యుప్మెంట్ రావడం జరిగిందని, వీటిని హాట్ స్పాట్ ప్రాంతాల్లో వినియోగించి , రేపటి లోగా 2 వేల శాంప్లిల్స్ తీయాలని లక్ష్యం గా నిర్ణయించినట్లు తెలిపారు.ట్రూనాట్ మిషన్ ద్వారా రాపిడ్ టెస్ట్ నిర్వహించేందుకు గంట నుండి గంటన్నర సమయం తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లా లో కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా, ఎన్.డి.ఆర్.ఎఫ్. నుండి శిక్షణ పొందిన 22 మంది సిబ్బంది నెల్లూరు కు రావడం జరిగిందని , వీరి సేవలను వినియోగించుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. కరోనా నియంత్రణ కు తీసుకోవలసిన చర్యలను పటిష్టంగా అమలు చేసేందుకు డివిజన్ స్థాయిలో రెవిన్యూ డివిజనల్ అధికారి , డిఎస్పీ, డిప్యూటి డి.ఎం. అండ్ హెచ్.ఓ మరియు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ తో ఒక కమిటీ ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి లోని కంటైన్మైంట్ ప్రాంతాల్లో ప్రైమరీ, సెకండరీ పర్సన్స్ ను గుర్తించి, వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటారని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు లాక్ డౌన్ సమయంలో ప్రజలు సహకరించడం జరిగిందని , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మే నెల 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించిన నేపధ్యంలో ప్రజలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్, జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఆత్మ విశ్వాసంతో  వ్యాధుల పై విజయం

ఆత్మ విశ్వాసంతో  వ్యాధుల పై విజయం (పున్నమి ప్రతినిధి ` డా॥ గంగిశెట్టి శివకుమార్‌) మహామంత్రి తిమ్మరుసు చిన్నతనంలో గురువు పలక మీద గీత గీసి, తుడపకుండా దాన్ని చిన్నది చేయమంటే దాని పక్కనే పెద్ద గీత గీశాడు. ఆటోమాటిగ్గా ముందున్న గీత చిన్నదై పోయింది. ప్రస్తుత ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో ‘‘కరోనా’’ ఒక్కటే పెద్ద వ్యాధి అయింది. తదితర వ్యాధులన్నీ చిన్నవైపోయాయి. హాస్పిటల్స్‌, క్లీనిక్‌లు చాలా వరకు పనిచేయకపోయినా బాధపడేవారో, లేక ఇబ్బంది పడేవారో లేరు. డాక్టర్ల దగ్గరకు పోయే వారూ తగ్గిపోయారు. మందుల షాపు తెరచి వుండడంతో చాలా వరకు వారి చిన్నచిన్న ఆరోగ్య సమస్యల్ని మందుకొని పరిష్కరించుకుంటున్నారు. చిన్న చిన్న వ్యాధులకు టెన్షన్‌ పడడం తగ్గిపోయింది. తమ సహజ సిద్ధంగా  ఉన్న ‘రోగనిరోధక శక్తి’ మీద నమ్మకాన్ని పెంచుకున్నారు. దేశంలో ప్రతి చిన్న వ్యాధి నుంచి పెద్ద వ్యాధి దాకా చీటికి మాటికి కంగారెత్తిపోయి ఆసుపత్రులు చుట్టూ తిరిగే జనం లాక్‌డౌన్‌ సందర్భంగా బాగా ఇబ్బంది పడతారని విశ్లేషకులు అంచనావేశారు. అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తాయని ఆందోళన వెలిబుచ్చారు. కానీ లాక్‌డౌన్‌ మూడు వారాలు గడిచాక చూస్తే అలాంటి ఆందోళనకు అవకాశమే లేకుండా పోయింది. దేశంలో మరణాల రేటు ఏమీ పెరిగిన దాఖలాలు లేవు. మన దేశంలో మధ్యతరగతి వాళ్లు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లడం మానేసి చాలా కామైంది. పూర్తిగా ప్రైవేటు, కార్పొరేట్‌ హాస్పిటళ్ల మీద ఆధారపడ్డారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ అనవసరంగా  పరీక్షలు, స్కానింగ్‌ పేరిట పెద్ద ఎత్తున జనాన్ని దోపిడీ చేయడం ప్రారంభించారు. అయినా ప్రాణ భయంతో ప్రతిచిన్న ఆరోగ్య సమస్యకు వైద్యులను సంప్రదించడం, రోగుల వేలకు వేలు దారపోసుకోవడం జరుగుతూ వుండేది. కరోనా దెబ్బతో ఆ దోపిడీ వ్యాపారం వెనక్కుపోయింది. ఇంటి పట్టునే వుండడం, ప్రశాంతంగా వుండటం, వత్తిడి లేకుండా వుండటం, సరదాగా కుటుంబ సభ్యులతో గడపటం, టి.వి.లో కార్యక్రమాలు చూస్తూ వినోదించడం, చిన్నాచితకా ఆరోగ్య సమస్యలకు డాక్టర్‌ దగ్గరకు పోకుండా ప్రత్యామ్నాయ, సాంప్రదాయ వైద్యవిధానాలతో సరిపెట్టుకుంటున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం కూడా ప్రజల్లో ఈ చైతన్యం కొనసాగాలని నిపుణులు కోరుకుంటున్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఇది.. ఓ కరోనా మిగిల్చిన విషాద కథ..

ఇది.. ఓ కరోనా మిగిల్చిన విషాద కథ..అన్నీ ఉన్నా అనాథను చేసిన విషాద ఘటన.. ప్రపంచాన్ని వణికిస్తున్న కా రోనా మహమ్మారి తెలుగురాష్ట్రాల్లో మిగిల్చిన కన్నీటి వ్యధ. ఆయనో… పేరుగాంచిన ఆర్థోపెడిక్ డాక్టర్.. ఆస్తిపరుడు.. ఆర్ధిక స్థితిమంతుడు… పెద్ద ఎత్తున బంధుత్వాలు ఉన్నాయి..అతని చేత్తో వైద్యం చేస్తే.. ఎలాంటి రోగమైనా.. కీళ్లనొప్పులు..కాళ్ళనొప్పులు.. ఇట్టే మాయమౌతాయి… ఆయన హస్తవాసికున్న ప్రత్యేకతది… అందుకే 50 నుంచి 60 ఏళ్ల వయస్కులకు ఆయన వైద్యమంటే అంత నమ్మకం.. అందుకే ఆ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ కావాలంటే కనీసం వారం ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి.. అలాంటి వైద్యుడు …ముఖ్యంగా ఓ వర్గానికి చెందినవారి కి ఆయన వైద్యం పట్ల అపారమైన నమ్మకం… వైద్యం కోసం వెళ్లినవారిని నఖశిఖలా తడుముతూ.. నొప్పులు తగ్గిస్తారు..బహుశా ఏ డాక్టర్ అతనిలా రోగిని దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా వైద్యం చేయరేమో.. చివరికి రోగిపట్ల ఆ ఆప్యాయత ఆయన ప్రాణాలు తీసింది.. కరోనా రూపంలో కాటేసింది..వారం క్రితం వరకు వైద్యం చేసిన ఆ చేతులను..ఆ డాక్టర్ ను తాకేందుకు.చివరికి చూసేందుకు అందరూ భయపడ్డారు..ఆఖరి దశలో అనాథలా కాలగర్భంలో కలిసిపోయారు..ఇదే మొన్న కరోనా తో కన్నుమూసిన డాక్టర్ పీ. లక్ష్మీనారాయణ రెడ్డి..కథ. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మొహం మరి ఎంత కఠినంగా కఠోరంగా భయంకరంగా ఉంటుందో దానికి చేతుల్లో పడి ప్రాణాలు కోల్పోయిన వారి దుస్థితిని చూస్తే ఎవరికైనా గగుర్పాటు కలగకమానదు కరోనా మహమ్మారి కాటేస్తే వారి జీవితం ఎంతటి దుర్భరంగా ఉంటుందో ఇప్పటివరకు మనం విన్నాం ప్రపంచవ్యాప్తంగా కన్నం నెల్లూరు జిల్లాలో 2 రోజుల క్రితం ఈ కరో నా మహమ్మారి బారినపడ్డ డాక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డి జీవిత చరమాంకం పెద్ద తార్కాణం.. ఆయన మరణాంతర పరిస్థితి చూస్తే ఎవ్వరైనా గగుర్పాటుకు గురికాకతప్పుదు. ఈ వ్యాధి సోకితే ఎంతటి దుర్భర స్థితి ఉంటుందో మనిషిలో గుబులు పుట్టిస్తోంది.ఒక డాక్టర్ గా తన చేతులతో ఎన్నో ప్రాణాలు కాపాడి డాక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డి చివరకు దిక్కులేని దహన సంస్కారాలకు గురయ్యారు. నెల్లూరు నగరంలో ఆర్థో వైద్య చికిత్సల్లో చేయి తిరిగిన డాక్టర్ లలో ఆయనొకరు. అంతకుమించి మంచి హస్త వ్యాధి కలిగిన వైద్యుడిగా పేరుంది.. డాక్టర్ లక్ష్మీ నారాయణ రెడ్డికి. ఎంతోమంది వైకల్యం కలిగిన వారికి దారి చూపారు. ప్రమాదాల్లోనో… పుట్టుకతోనే అంగవైకల్యం కలిగిన అనేకమందికి జీవితం మీద నమ్మకాన్ని ,భరోసాను కలిగించారు ఆయన.. అంతటి వైదుడిని కరోనా క్షబ్సలించినానంతరం ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.. ఎంతోమందిని వైద్యం కోసం స్ఫురించిన ఆయన్ను తాకేందుకు ఏ చేతులూ ముందుకు రాలేదు.. నిరంతరం వైద్యసేవల్లో మునిగి ఉండే ఆయనకు వారం క్రితం . అస్వస్థతగా ఉందని నెల్లూరులోని ఒక ఆస్పత్రిలో చేరారు. పరిస్తితి విషమంగా ఉండటంతో అతన్ని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ కరోనా అని తేలవడంతో ఐసోలేషన్ వార్డులో ఉంచారు.పరిస్థితి విషమించడంతో లక్ష్మీనారాయణ రెడ్డిని మెరుగైన వైద్య చికిత్సలు కోసం పక్కరాష్ట్రం చెన్నై లోని అపోలో హాస్పిటల్స్ కి తరలించారు.అక్కడే చికిత్స పొందుతూ చనిపోయారు. అరుదైన డాక్టర్ని పొట్టన పెట్టుకున్న కరోనా ఆయన కుటుంభం,తన వైద్యశాల పైనా పంజావిసిరింది.దురదృష్టవశాత్తూ ఆయన చనిపోవడానికి ముందే కరోనా వల్ల ఆయన కుటుంబాన్ని క్వారంటైన్ కి తరలించారు. అక్కడ వారికి పాజిటివ్ అని తేలడంతో వారు నెల్లూరులో చికిత్స తీసుకుంటున్నారు. ఆ తర్వాత డాక్టరు చనిపోగా కేంద్ర నిబంధనల ప్రకారం బంధువులకు అప్పగించకుండా కొద్ది మంది బంధువుల సమక్షంలో అంత్యక్రియలు జరపాలని నిర్ణయించారు.బట్ కరోనా మరణం కావడం – ప్రత్యేక అనుమతులు అవసరం కావడం వల్ల బంధువులు ఎవరూ ముందుకు రాలేదు.  సొంత కుటుంబం ఐసోలేషన్ వార్డులో ఉంది. అనాథగా అయినా అంత్యక్రియలు జరిగాయా అంటే అదీ లేదు. ఆస్పత్రి సిబ్బంది ఎలక్ట్రిక్ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. కానీ అక్కడ శవ దహనానికి నిరాకరించారు. మరో చోట కూడా అలాగే జరిగింది.  కారణమేంటో తెలుసా… ప్రభుత్వ ఆస్ప్రత్రుల్లో మరణాలకే చేయాలని వారికి నిబంధనలు ఉన్నాయట. ఏం  చేయాలో తోచని సిబ్బంది… అంబత్తూరు శ్మశాన వాటిక వద్దకు ఆ డాక్టరు మృతదేహాన్ని సోమవారం సాయంత్రం తీసుకెళ్లారు. ఇది తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడ గుమిగూడి ధర్నాకు దిగారు.కరోనాతో మృతి చెందిన వారికి ఇక్కడ దహనం చేయడానికి వీల్లేదంటూ పట్టుబట్టారు. ఆస్పత్రి సిబ్బందిని దూషించారు.దాంతో చేసేది లేక మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు…డాక్టర్ డెడ్ బాడీ ని మళ్ళీమార్చురీకి తరలించారు.తెల్లవారు ఝామున ఎవ్వరూ లేనిసమయంలో అంబత్తూర్ ఎలక్ట్రిక్ స్మశాన వాటికకు తరలించి డాక్టర్ అంత్యక్రియలు పూర్తిచేశారు.. ఆస్తులు.. ఆర్థిక పరిస్థితులు.. బందుగణం.. ఉన్న ఒక పేరుగాంచిన ఆర్థోపెడిక్ డాక్టర్ కరోనా భారిన పడితే ఎలాంటి ఎదురైందో చూడండి.. చివరకు అంత్యక్రియలు కు నోచుకోని దుస్థితి.. ఎదురైందంటే.. ఈ మహమ్మారిపట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రతీ ఒక్కరూ ఆలోసించండి… బీ కేర్ ఫర్ కరోనా.

Featured ఆంధ్రప్రదేశ్

లాక్‌డౌన్‌ క్రాప్‌

లాక్‌డౌన్‌ క్రాప్‌ కొంత మంది జుట్టు పెంచుకుని అదొక ఫాషన్‌గా సరదాగా గడుపుతుంటారు. కానీ ఎక్కువ మంది జుట్టు పెరిగితే సరదాగా వుండలేరు. వారికి చిరాగ్గా వుంటుంది. ఎప్పుడెప్పుడు క్రాప్‌ చేయిస్తామా? అని ఎదురుచూస్తుంటారు. కాస్త తీరిక దొరికితే సోన్‌కి వెళ్లి, క్రాప్‌ చేయించుకుంటూ వుంటారు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు, సెలూన్లు తెరిచి 20 రోజుల పైనే అయిపోయింది. మరో 20 రోజు సెలూన్లు తెరిచే పరిస్థితి లేదు. గ్రామాల్లో అయితే బార్బర్‌ ఇంటికి వచ్చి, క్రాప్‌ చేసే అవకాశం వుంటుంది. పట్టణాల్లో వీలు కాదు. అలా అని క్రాప్‌ పెంచుకుని లాక్‌డౌన్‌ అయ్యేదాకా వేచి వుండాంటే ఎక్కువ మంది జనానికి విసుగు, చిరాకూను. అందుకే హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్న నెల్లూరు నివాసి జి.వి.నాగరాజారావు ఇంట్లోనే తన భార్య సుధ సహకారంతో క్రాప్‌ శుద్ధంగా, సెలూన్లో లాగే చేయించుకుని, తల భారం తగ్గించుకున్నారు. గాంధీ చెప్పినట్లు మన పనులన్ని మనమే చేసుకునే రోజులు వచ్చాయి కరోనా వల్ల.  క్రాపుల్లో రకరకాల క్రాపులు ప్రాచుర్యంలో వున్న నేడు కొత్తగా ‘లాక్‌డౌన్‌క్రాప్‌’ కూడా చేరింది.

Featured ఆంధ్రప్రదేశ్ హెల్త్ టిప్స్

మన లైఫ్ ఇప్పటిదాకా ఒక లెక్క..ఇప్పుడోలెక్క

మన లైఫ్ ఇప్పటిదాకా ఒక లెక్క..ఇప్పుడోలెక్క కరోనా పూర్తిగా కనుమరుగైన తర్వాత కూడా ఇలాంటి వైరస్​లు మరిన్ని పుట్టుకురావొచ్చు. అందుకే ఇప్పటిదాకా గడిపిన జీవితం వేరు.. ఇక నుంచి గడపాల్సిన జీవితం వేరు. పర్సనల్​గానే కాదు ఫ్యామిలీ మెంబర్స్​తో గడిపే లైఫ్​ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్​, రిలేటివ్స్​, కొలీగ్స్​తో రిలేషన్​ కూడా చేంజ్​ చేసుకోవాలి.  వీటన్నింటితో పాటు.. మన అలవాట్లు కూడా మార్చుకోవాలి. ఇంటి నుంచే మొదలవ్వాలి లైఫ్​స్టైల్​ చేంజ్​ అనేది ముందుగా ఇంటి నుంచే మొదలవ్వాలి. బయటి పరిస్థితులు ఎలా ఉన్నా… ఇంట్లో ఉండాల్సి వస్తే, ఆ ఇల్లు ఆరోగ్యాన్నిచ్చేదిలా ఉండాలి. అంటే.. అవసరమైనప్పుడే ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా మార్పులు చేసుకోవాలి. ఎప్పుడూ మెడికల్​ షాపు​లోని మందులపైనే ఆధారపడకుండా ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషధ మొక్కలను ఇంట్లో పెంచాలి. ఇల్లు ఎప్పుడూ పొడిగా ఉండాలి. వాటర్ లీకేజీ లేకుండా రిపేర్​ చేయించుకోవాలి. అలాగే స్థలం ఉంటే బాత్రూమ్​, వాష్​రూమ్​ వంటివి ఆరుబయట ఏర్పాటుచేసుకోవాలి. బ్రష్​ చేసుకునే సింక్​ వంటివి కూడా ఇంట్లో కాకుండా బయటే ఉంటే బెటర్​. ఇంట్లోని ఫ్లోర్​ను ఈజీగా క్లీన్​ చేసుకునేలా స్పేస్​ ఫ్రీగా ఉంచుకోవాలి. అవసరంలేని వస్తువులన్నింటిని అటకెక్కించాలి. కిరాణా లిస్ట్​ మారాలి ఇప్పటిదాకా కిరాణా లిస్ట్​ కేవలం వంటింటి సరుకులు, సబ్బులు, సర్ఫ్​లకే పరిమితమయ్యేది. ఇకపై ఆ లిస్ట్​లో హ్యాండ్​వాష్, శానిటైజర్​ వంటివి కూడా చేర్చాలి. ఇప్పుడు కరోనా కలకలం ఉంది కదా అని మాత్రమే చేతులు కడుక్కుంటే సరిపోదు. ఇకపై కూడా చేతులు శుభ్రంగా ఉంచుకోవడం అలవాటుగా మార్చుకోవాలి. అందుకే ఇంట్లో ఎప్పుడూ హ్యాండ్​వాష్​, బ్యాగ్​లో ఎప్పుడూ శానిటైజర్​ ఉంచుకోవాలి. ఫుడ్​ హ్యాబిట్స్ మారాలి కాలంతో సంబంధం లేకుండా వేడి వేడివి  మాత్రమే తినాలి. ఫ్రిజ్​లో పెట్టి తినే అలవాటు మార్చుకోవాలి. కేవలం రుచికోసమే కాకుండా ఆరోగ్యం గురించి కూడా ఆలోచించి అన్నిరకాల ఆహారపదార్థాలు తినడం అలవాటు చేసుకోవాలి. జంక్​ ఫుడ్​, కూల్​ డ్రింక్స్​ వంటివాటికి వీలైనంత దూరంగా ఉండాలి.  తాజా కూరగాయలు, పండ్లు, మొలకెత్తిన గింజలు, డ్రైఫ్రూట్స్​ వంటివి రెగ్యులర్​గా తినాలి. నిజానికి జంక్​ఫుడ్​తో పోలిస్తే వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువే. ఫ్రిజ్​లో నీళ్లు తాగడం మానేసి వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. అంతగా చల్లటి నీళ్లు తాగాలనుకుంటే కుండలో నీళ్లు తాగాలి. వర్కవుట్స్​ కంపల్సరీ శరీరానికి తగినంత ఇమ్యూనిటీ​ ఉంటే వైరస్​లు, బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులన్నింటినీ దాదాపు తరిమికొట్టొచ్చు. అదే లేకపోతే మనం ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా లాభం ఉండదు. మరి ఈ ఇమ్యూనిటీ కోసం మంచి ఫుడ్​ మాత్రమే తీసుకుంటే సరిపోదు. శరీరంలోని ప్రతి వ్యవస్థ బలంగా మారేలా వర్కవుట్స్​ కూడా చేయాలి. ఇప్పటిదాకా అలవాటు లేకపోయినాసరే.. ఇక నుంచి వర్కవుట్స్​ హాబీగా మారాలి. యోగ, ధ్యానం, ప్రాణాయామం వంటివి కూడా ప్రాక్టీస్​ చేయాలి. వీటిని ఏదో ఒక మతానికి సంబంధించినవిగా చూడొద్దు.  *పర్సనల్​  హైజీన్​* వ్యక్తిగత పరిశుభ్రత అనేది ఎప్పుడూ అవసరమే. బిజీ షెడ్యూల్​ ఉందని స్నానం చెయ్యకుండా ఉండొద్దు. తరచూ కాళ్లు, చేతులు కడుక్కోవడం అనేది ఎప్పుడూ కంటిన్యూ చేయాలి. ఇంట్లోకి అడుగుపెట్టకముందే కాళ్లు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. అంతేగానీ.. అలసిపోయి వచ్చామంటూ సోఫాలో అలాగే సాగిలపడొద్దు. వీలైతే ఆఫీస్​ నుంచి వచ్చాక కూడా వేడివేడి నీళ్లతో స్నానం చేయాలి. అంతేకాకుండా తరచూ చేతులతో ముఖాన్ని, శరీర భాగాలను తాకే అలవాటు కూడా మార్చుకోవాలి. శుభ్రత ఇంటిని, పరిసరాలను మాత్రమే శుభ్రం  చేసుకుంటే సరిపోదు. వైరస్​లు, బ్యాక్టీరియాలబారిన పడకుండా ఉండాలంటే ఇంటితోపాటు ఇంట్లో ఉండే వస్తువులను, పర్సనల్​గా మనం వాడే వస్తువులను కూడా క్లీన్​ చేసుకోవాలి. ల్యాప్​టాప్​, ఫోన్​, వ్యాలెట్, హ్యాండ్​ బ్యాగ్​, కంప్యూటర్​, కీబోర్డ్, టీవీ రిమోట్​, రిస్ట్​ వాచ్​, బుక్స్​ వంటివి క్లీన్​ చేయడం గురించి ఆలోచించం. కానీ వీటిని ఎప్పటికప్పుడు క్లీన్​ చేసుకోవాలి. ఎందుకంటే నిజానికి వీటివల్లే  వైరస్​ స్ప్రెడ్​ అవుతుంది. పిల్లలు, పెద్దల పట్ల పిల్లలు, పెద్దల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా అస్సలు ఉండొద్దు. ‘జ్వరమేకదా.. జలుబే కదా.. దగ్గు కామనే’.. అంటూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎప్పుడూ ఇలాగే వస్తుంది కదా, అదే తగ్గిపోతుందిలే అనే వైఖరి ఇకపై మారాలి.  అలాగని మెడికల్​ షాపు​ నుంచి ఏదిపడితే అది తెచ్చి వేయొద్దు. పిల్లలను శుభ్రంగా ఉంచడంతోపాటు వాళ్లకు బలమైనవి తినిపించాలి. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే డాక్టర్​ను కలవాలి. ఎక్కువయ్యేదాకా ఆగడం మంచిదికాదు. పెద్దోళ్ల విషయంలో కూడా ఇలాగే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు, వృద్ధుల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి. అవుట్​డోర్​ మీటింగ్స్​ టైంపాస్​ కాకపోతే అలా బయటకి వెళ్లొస్తామంటూ వెళ్లిపోతారు. సెలవు దొరికితే షికార్లకు ప్లాన్​చేస్తారు. కొన్నిసార్లు నేరుగా కలవాల్సిన​ అవసరం లేకపోయినా వెళ్లి కలిసి వస్తారు. బ్యాంకులు, బిల్లుల చెల్లింపు వంటివాటి కోసం గంటల తరబడి లైన్లలో నిలబడతారు. నిజానికి ఇవన్నీ ఇంటి నుంచే చేసుకోవచ్చు. అందుకే ఇకపై అవుట్​డోర్​ మీటింగ్స్​ను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. వీలైనంత వరకు ఫోన్​, ఆన్​లైన్​ చాటింగ్​ ద్వారానే పూర్తయ్యేలా చేసుకోవాలి. తప్పనిసరి అయితే తప్ప బయటికి వెళ్లొద్దు. సెల్ఫ్​ డిసిప్లిన్​ సెల్ఫ్​ డిసిప్లిన్​ తప్పనిసరి. అది ఇంట్లో ఉన్నా సరే.. బయటకెళ్లినా సరే. ఎక్కడైనా ‘క్యూ’లో నిలబడాల్సి వస్తే మనిషికి, మనిషికి మధ్య స్పేస్​ ఉండేలా నిలబడాలి. విదేశాల్లో ఈ కల్చర్​ ఉన్నా.. మనదేశంలో మాత్రం మీదపడి తోసుకోవడమే. అంతేకాదు.. తుమ్మినా, దగ్గినా దస్తీ​ అడ్డంగా పెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు కూడా దూరంగా ఉండి మాట్లాడాలి. తుంపర్లు పడేలా మరీ దగ్గరగా ఉండొద్దు……….

Featured ఆంధ్రప్రదేశ్

అత్యంత విషాదకరంగా చెన్నైలో నెల్లూరు డాక్టర్‌ అంత్యక్రియలు…

‘‘విధి ఒక విషవలయం, విషాద కథ కది నిలయం’’ ` అన్నాడు ఒక సినీ కవి. ఇది నిన్న చెన్నైలో మరణించిన డా.క్ష్మీనారాయణ రెడ్డి విషయంలో అక్షరాల నిజమైంది. కరోనాతో జీవితాన్ని చాలించిన డాక్టర్‌ అంత్యక్రియు నిన్న అత్యంత విషాదకరంగా చెన్నైలో ముగిశాయి. డాక్టర్‌ కరోనాకు బలైపోవడం ఒక ఎత్తయితే ఆయన భార్యకు కరోనా వైరస్‌ సోకడంతో నెల్లూరులో చికిత్స పొందుతుండడం, బిడ్డ మరో చోట వుండడం, గుండెల్ని పిండేసే సంఘటను. భర్తను కడసారి చూచుకునే అదృష్టానికి ఆ భార్యా, బిడ్డా నోచుకోకపోవడం మరింత విషాదకరం. అలానే ఆయన మిత్రుల0తా చివరి చూపుకు నోచుకోకపోయారు. డాక్టర్‌ అంత్యక్రియలుకు హాజరుకాలేక కడసారి చూపుకు దూరమయ్యారు. డాక్టరు ఎన్నో ఆశలు, ఆశయాలతో వైద్య వృత్తిని చేపట్టి ఉంటారు. తన జీవిత భాగస్వామిని బాగా చూసుకోవాలని, ఆరేళ్ల కుమారుడికి ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలని ఎన్నో కలలు కనివుంటారు. చివరకు కరోనా కాలసర్పానికి బలైపోయారు. డాక్టరు అంత్యక్రియలకు చెన్నై కార్పొరేషన్‌ ముందు ససేమిరా అంది. ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు గనుక మేము చేయలేమని చెప్పిన స్మశాన సిబ్బంది, పార్థివ దేహాన్ని వదిలి వెళ్లిపోయిన సిబ్బంది హృదయవిదారకంగా మారిన పరిస్థితి. చివరకు రాష్ట్ర ఉన్నతాధికారుల జోక్యంతో పోరూరు స్మశాన వాటికలో అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వ హెల్త్‌ ప్రోటోకాల్‌ ప్రకారం కార్పొరేషన్‌ సిబ్బంది పూర్తి చేశారు. పగవాడికి కూడా ఇంత కష్టం వద్దురా బాబూ అనుకుంటున్నారు నెల్లూరు ప్రజలు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.