ఖానాపురం పున్నమి ప్రతినిధి: ఎన్నికల సమయంలో గొల్లకురుమలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని GMPS వరంగల్ జిల్లా కార్యదర్శి పరికి మధుకర్ డిమాండ్ చేశారు. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం (GMPS) ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి, అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
గొర్రెల పంపిణీ పథకం కింద రూ.2 లక్షల నగదు, ప్రమాదవశాత్తు మరణించే గొర్రెల కాపరుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా, నిరుద్యోగ యువతకు రూ.50 లక్షలతో గొర్రెల ఫారాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 50 ఏళ్లు నిండిన గొల్లకురుమలకు పింఛన్లు, ఖాళీ వెటర్నరీ పోస్టుల భర్తీ, ప్రతి గ్రామంలో పశువైద్యశాలలు, ఉచితంగా పశువుల మందులు అందించాలని కోరారు.
గొల్లకురుమల సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మత్తుర్తి అన్వేష్, GMPS జిల్లా కమిటీ సభ్యులు బోయిని రాజు, కుక్కల సతీష్, లెంకలపల్లి రాజు, గుండు బాలకృష్ణ, లంకలపల్లి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
