రహదారి భద్రతా చర్యలను వేగవంతం చేయాలి-జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
————————————————————-
*ఘనపూర్, చిన్న పెండియాల్, కరుణాపురం ఎఫ్ఓబీ (FOB) పనుల్లో వేగం పెంచాలి*
*ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్లోనే అత్యవసర వైద్యం అందేలా చర్యలు*
*పాఠశాల బస్సుల్లో నిఘా నేత్రాల ఏర్పాటు, వాటి పనితీరును తనిఖీ చేయాలి*
*హైవేలపై రంబుల్ స్ట్రిప్స్, థర్మోప్లాస్టిక్ పాయింట్ల ఏర్పాటుతో వేగ నియంత్రణ*
*అనధికార పార్కింగ్‌లను తొలగించాలి*
*జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*
జిల్లాలో రహదారి భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేయాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అధికారులను ఆదేశించారు.
బుధవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో *డీసీపీ రాజ మహేంద్ర నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అధ్యక్షతన జిల్లా రహదారి భద్రత కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై రహదారి భద్రతా చర్యలు, ప్రమాదాల నివారణ, అనధికార పార్కింగ్లు, రహదారి సూచికలు, లైటింగ్, సర్వీస్ రోడ్లు, వాహనాల వేగ నియంత్రణ, తదితర అంశాలపై క్షుణ్ణంగా సమీక్షించారు.
ఈ క్రమంలో జాతీయ రహదారి-163పై ఎల్ఈడీ లైటింగ్ ఏర్పాటు, రహదారి సూచికల (సైనేజ్) అప్‌గ్రేడేషన్, జనగామ పట్టణానికి సర్వీస్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు *ఎన్హెచ్ఏఐ అధికారులు, కలెక్టర్‌కు* వివరించారు.
ఈ నేపథ్యంలో *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. కోమల్ల టోల్ ప్లాజా వద్ద అనధికార పార్కింగ్‌ను తొలగించాలని, కరుణాపురం ప్రాంతంలోని మద్యం దుకాణాల వద్ద పార్కింగ్ సమస్యలను పరిష్కరించి, రహదారిపై వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అనధికార పార్కింగ్‌ను కూడా తొలగించాలని సూచించారు.
ఘనపూర్ (స్టేషన్), చిన్న పెండ్యాల, కరుణాపురం ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) నిర్మాణాలను వేగవంతం చేసి, పూర్తి చేయాలని ఆదేశించారు.
జాతీయ రహదారులపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు అవసరమైన ప్రాంతాల్లో రంబుల్ స్ట్రిప్స్, థర్మోప్లాస్టిక్ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జనగామ పట్టణంలోకి ప్రవేశించే ప్రాంతంలోని రహదారి వద్ద ఉన్న వేగ నియంత్రణకు సంబంధించి బెల్ మార్క్‌ను సరిచేసి, వాహనాల రాకపోకలకు అనుకూలంగా సాఫీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఎల్లమ్మ దేవాలయం వద్ద అవసరమైన లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని అన్ని పాఠశాల బస్సుల్లో నిఘా నేత్రాలను (సీసీ టీవీ కెమెరాలు) ఏర్పాటు చేయడం (లేదా) ఇప్పటికే ఉన్న సీసీ టీవీ కెమెరాల పనితీరును తనిఖీ చేయాలని ఆదేశించారు. విద్యార్థుల రవాణా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి ప్రమాదం జరిగిన గోల్డెన్ అవర్లోనే అత్యవసర వైద్య సేవలు అందేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సమీపంలోని అత్యవసర వైద్య సేవలు అందించే ఆసుపత్రికి బాధితులను వీలైనంత తక్కువ సమయంలో తరలించేలా గ్రీన్ ఛానల్, ఆసుపత్రుల మ్యాపింగ్, రూట్ మ్యాపింగ్ సిద్ధం చేయాలని సూచించారు.
అనంతరం *డీసీపీ* మాట్లాడుతూ.. పెంబర్తి వై-జంక్షన్ వద్ద అవసరమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నవాబుపేట కర్వ్ వద్ద రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసి, వాహనాల వేగాన్ని నియంత్రించే చర్యలు చేపట్టినట్లు వివరించారు.
ఈ సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, కిరణ్ ప్రకాష్, ఘనపూర్ (స్టేషన్) ఏసిపి భీం శర్మ, ఆర్టీఏ సభ్యులు చిలువేరు అభి గౌడ్, నేషనల్ హైవేస్ హెచ్ఎంఆర్ఈ మధుసూదన్ రెడ్డి, జనగామ, ఘనపూర్ (స్టేషన్) మున్సిపల్ కమిషనర్లు రాజశేఖర్ రెడ్డి, రాధాకృష్ణ, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, డీఎంహెచ్ఓ వాణిశ్రీ, డీపీఓ వెంకట్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.





