విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలి
పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 26: విద్యుత్ రంగంలోని కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులను సంస్థలో విలీనం చేసి క్రమబద్ధీకరించాలని కోరుతూ జేఏసీ నాయకులు కడప ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ హరి సేవా నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.
జేఏసీ చైర్మన్ నాగిరెడ్డి మాట్లాడుతూ ఏపీ జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కం సంస్థల్లో 20 ఏళ్లకు పైగా సుమారు 30 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు.
కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దు చేసి కార్మికులను సంస్థలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ సమయంలో కార్మికులకు తగిన ప్రయోజనాలు కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ జనరల్ సెక్రటరీ చంద్ర గంగిరెడ్డి, కోఆర్డినేటర్ హరికేశవరెడ్డి, శివారెడ్డి, నిత్యపూజ, నాగేంద్ర, సుధాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


