పది ఎకరాల భూదానం.. వేలాది ఆడబిడ్డల భవిష్యత్తుకు పునాది
వసంత నాగేశ్వరరావు గారి దాతృత్వం నేటికీ వేలాది కుటుంబాలకు వెలుగునిస్తోంది: ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు.
నందిగామ: నందిగామ పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో కూటమి నేతలు, అధ్యాపక సిబ్బందితో కలిసి మాజీ హోం, నీటిపారుదల శాఖ మంత్రివర్యులు శ్రీ వసంత నాగేశ్వరరావు గారి చిత్రపటాన్ని ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు ఆయన సేవలను, దాతృత్వాన్ని స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. “ఈరోజు మనం ఆవిష్కరిస్తున్నది కేవలం ఒక మహనీయుని చిత్రపటాన్ని మాత్రమే కాదు.. నందిగామలో ఈ విద్యా దేవాలయం ఆవిర్భావానికి కారణమైన ఆయన దార్శనికతకు కృతజ్ఞతాభివందనం” అని అన్నారు.
1988లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళా విద్యాభివృద్ధికి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని, ఉమ్మడి రాష్ట్రంలోని ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేసి మహిళలకు సాంకేతిక విద్యను చేరువ చేయాలని సంకల్పించారని గుర్తుచేశారు. ఉచితంగా స్థలం ఇచ్చే దాతలు ఉన్న ప్రాంతాల్లోనే ఈ కళాశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో, నందిగామ ఆడబిడ్డలు సాంకేతిక విద్యలో ముందుకు సాగాలనే మహోన్నత సంకల్పంతో వసంత నాగేశ్వరరావు గారు ముందుకు రావడం నందిగామ ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. నందిగామ ప్రాంత మహిళల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విలువైన 10 ఎకరాల భూమిని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల కోసం ఉచితంగా దానం చేయడం ఆయన విశాల హృదయానికి నిదర్శనమని కొనియాడారు.
ఆనాడు ఆయన చేసిన నిస్వార్థ భూదానం కారణంగానే నేడు నందిగామలో ఈ విద్యా సంస్థ ఏర్పడి వేలాది మంది విద్యార్థినులకు సాంకేతిక విద్యను అందిస్తూ మహిళా సాధికారతకు కేంద్రంగా నిలిచిందని అన్నారు.వసంత నాగేశ్వరరావు గారి దాతృత్వం కేవలం పాలిటెక్నిక్ కళాశాలకే పరిమితం కాలేదని, అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా నందిగామ పరిసర ప్రాంతాలకు చెందిన పేద మహిళలు కుట్టుపని తదితర వృత్తి నైపుణ్యాలను నేర్చుకుని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
“వసంత నాగేశ్వరరావు గారు చేసిన పది ఎకరాల స్థలదానం కేవలం భూదానం కాదు.. వేలాది మంది ఆడబిడ్డల భవిష్యత్తుకు మీరు వేసిన గట్టి పునాది. ఆనాడు మీరు చల్లిన విత్తనం నేడు మహావృక్షంగా మారి ఎందరో ఆడబిడ్డలకు విద్యా నీడను అందిస్తోంది. ఇక్కడ చదువుకుని ఉద్యోగాలు సాధించిన అమ్మాయిలు తమ కుటుంబాలను నిలబెట్టుకోవడమే కాకుండా సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నిజం చెప్పాలంటే.. మీరు ఇచ్చింది పది ఎకరాల భూమి కాదు.. వేలాది కుటుంబాల జీవితాలకు ఇచ్చిన ఉజ్వలమైన వెలుగు” అని తంగిరాల సౌమ్య భావోద్వేగంగా అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.




