– సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే నల్లమిల్లి విజ్ఞప్తి
అనపర్తి, సెప్టెంబరు 25 (పున్నమి ప్రతినిధి): అనపర్తి ఏరియా హాస్పిటల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రిని ఆయన కార్యాలయంలో కలిసి మెమొరాండం సమర్పించారు.
అనపర్తి ఏరియా హాస్పిటల్కు రోజుకు 500 నుంచి 600 మంది వరకు ఔట్పేషెంట్లు వస్తున్నారని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. సుమారు 136 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని వివరించారు.
అనపర్తి నియోజకవర్గంలో క్యాన్సర్ కేసులపై ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఇటీవల నిర్వహించిన క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాల్లో ఈ అంశం స్పష్టమైందని తెలిపారు. జాతీయ సగటుతో పోలిస్తే నియోజకవర్గంలో క్యాన్సర్ కేసుల శాతం అధికంగా ఉన్నట్లు పేర్కొంటూ, స్థానికంగా ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.


