ఖమ్మం: నగరంలోని బ్రాహ్మణవాడలో వినూత్న రీతిలో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలిసారిగా క్వింటాల్ సీడ్ బాల్స్‌తో రూపొందించిన సూర్య ప్రభ వాహన దక్షిణమూర్తి స్వరూప గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుమారు 40 అడుగుల ఎత్తులో పర్యావరణహితంగా రూపొందించిన ఈ గణనాథుడు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 1994లో కేవలం ఒక అడుగు ఎత్తు విగ్రహంతో ప్రారంభమైన ఈ ఉత్సవ సమితి, 2016 నుంచి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP) విగ్రహాలకు స్వస్తి పలికి పర్యావరణహిత విగ్రహాలను ఏర్పాటు చేస్తోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా దక్షిణ దిశగా పూజలు అందుకుంటున్న ఏకైక గణపతిగా ఈ విగ్రహానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గణనాథుడిని దర్శించుకుంటున్నారు.


