పోలవరం నీటితో పాటు వర్షపు నీరు చేరడంతో పంటకు తీవ్ర నష్టం..!!
పున్నమి – కే. ఆనంద్ (అనకాపల్లి జిల్లా బ్యూరో ) :
గోకివాడ గ్రామంలో వరి పంటలు నీటమునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి శారదా నదిలోకి నీరు రావడంతో పాటు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లోకి భారీగా నీరు చేరింది. దీంతో గోకివాడ పరిసర ప్రాంతాల్లోని వరి పొలాలు పూర్తిగా నీటమునిగాయి. గ్రామానికి చెందిన రైతు పొట్నూరు శ్రీను సుమారు 20 ఎకరాల్లో వ్యవసాయం చేస్తుండగా, 10 ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రస్తుతం పంట నీటిలో మునిగిపోవడంతో పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు త్వరగా తగ్గకపోతే పంట మరింత దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై నీటి ప్రవాహాన్ని పరిశీలించి, పొలాల్లో నిలిచిన నీటిని త్వరగా తొలగించే చర్యలు చేపట్టాలని రైతుల తరపున ప్రజా నాయకుడు ద్వారపురెడ్డి నాగేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు


