– భూ సమస్యలు పరిష్కరించి.. గిట్టుబాటు ధర కల్పించాలి
– ఎరువుల యాప్‌లు రద్దు చేసి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి
చిట్వేల్: మండల పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పందికాళ్ల మణి డిమాండ్ చేశారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసీల్దార్ నరసింహారావుకు రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంట రుణాలు మాఫీ చేయాలని, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలని కోరారు. ఎరువుల కోసం అమలు చేస్తున్న వివిధ యాప్‌లను రద్దు చేసి రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని విజ్ఞప్తి చేశారు. భూములు ఉన్న ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలు వర్తింపజేయాలని, కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బొప్పాయి రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించాలని, పశువులకు ఉచితంగా మేత పంపిణీ చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి శంకరయ్యతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.


