ఆదమరిచిన ట్రాఫిక్ సిబ్బంది: ఇబ్రహీంపట్నం రింగ్ సర్కిల్‌లో కిలోమీటర్ల మేర ‘ట్రాఫిక్ జామ్’
ఎన్టీఆర్ జిల్లా:
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్, 19,
ఇబ్రహీంపట్నం,నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే ఇబ్రహీంపట్నం రింగ్ సర్కిల్ శనివారం ఉదయం పూర్తిగా స్తంభించిపోయింది. వాహనాల నిలిపివేతతో ఎటుచూసినా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి, సర్కిల్ మొత్తం అష్టదిగ్బంధనంగా మారింది. అత్యవసరంగా వెళ్లాల్సిన ‘108’ అంబులెన్స్‌ల కు సైతం దారి లేని దుస్థితి నెలకొనడంతో రోగుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి.
చెట్టు కింద సిబ్బంది సేద తీరడం వల్లే..అత్యంత ప్రమాదకరమైన ఈ కూడలిలో వాహనాలను నియంత్రించాల్సిన ట్రాఫిక్ సిబ్బంది, ఎండ తీవ్రత ఎక్కువగా ఉందనే నెపంతో బాధ్యతలను విస్మరించి చెట్టు కింద సేదతీరడం కనిపించింది.
సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వాహనాలు ఒకదానికొకటి అడ్డుగా వచ్చి భారీగా జామ్ అయ్యాయని వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం సర్కిల్ తీవ్ర సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతుండగా, ఉన్న కొద్దిమంది సిబ్బంది కూడా ఈ విధంగా బాధ్యతారహితంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఉన్నతాధికారులు స్పందించాలి:రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా ఇబ్రహీంపట్నం రింగ్ సర్కిల్‌లో సమర్థవంతమైన, అదనపు ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.



