ఘట్కేసర్: బుగ్గనగర్ కాలనీలో గణేష్ నవరాత్రి వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. 1988 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది కాలనీలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం గణేష్ విగ్రహాన్ని గతంలో ఎడ్ల బండ్లపై ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేసేవారమని తెలిపారు.
వేడుకల్లో భాగంగా ఏడవ రోజు నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమారు1500 మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
అదేవిధంగా గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే లడ్డు వేలం పాటకు కూడా మంచి స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. గత ఏడాది నిర్వహించిన లడ్డు వేలం పాటలో రూ.69 వేల ధర పలికిందని, ఈ ఏడాది అంతకంటే అధిక ధరకు లడ్డు వేలం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాల నిర్వహణలో సంజయ్, అజయ్, విఘ్నేశ్వర్ యూత్ సభ్యులు, రాహుల్, శివ, భూపేందర్, అనిల్, టిల్లు తదితరులు పాల్గొన్నారు.



