టీడీపీ–జనసేన–బీజేపీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి: జిల్లా స్థాయి సమావేశంలో నిర్ణయం
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 12 (పున్నమి ప్రతినిధి): తూర్పుగోదావరి జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో నిర్ణయించారు. ఎన్నికల అబ్జర్వర్ల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.
టీడీపీ తరఫున ఎన్నికల అబ్జర్వర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ తరఫున ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీక్కి నాగేంద్ర, జనసేన తరఫున మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ గంటా స్వరూప, ఆత్మ చైర్మన్ రావాడ నాగు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు, సీట్ల కేటాయింపు తదితర అంశాలపై స్పష్టత వచ్చే వరకు మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పూర్తి సమన్వయంతో వ్యవహరించాలని నిర్ణయించారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మూడు పార్టీల శ్రేణులు సమష్టిగా పనిచేయాలని నాయకులు సూచించారు.
మండల, నియోజకవర్గ స్థాయిలోనూ నిరంతర సమన్వయం కొనసాగిస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయాలని నిర్ణయించారు. కూటమి ఐక్యతే బలం.. సమన్వయమే విజయానికి మార్గం అనే లక్ష్యంతో స్థానిక ఎన్నికలను సమష్టిగా ఎదుర్కొనేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.








