*ఒంగోలు జిజిహెచ్‌లో రూ. 23.75 కోట్లతో నిర్మించిన అత్యాధునిక క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం*
*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్*
*వర్చువల్ విధానంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శ్రీ జే.పి. నడ్డా, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్*
*ఒంగోలులో ప్రత్యక్షంగా ప్రారంభించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్ధనరావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే శ్రీ బి. ఎన్.విజయ్ కుమార్ , జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి*
రాష్ట్రంలోని పేద మరియు సామాన్య ప్రజలకు కార్పొరేట్ రంగానికి దీటుగా ఉచితంగా మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.
శనివారం ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (GGH) ప్రాంగణంలో పీఎం-ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM) కింద రూ. 23.75 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ (CCB) ను మంత్రి గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధనరావు, సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బి.ఎన్.విజయ్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి తో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యక్షంగా ప్రారంభించారు.
అంతకుముందు అమరావతి నుండి వర్చువల్ విధానం ద్వారా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జే.పి. నడ్డా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఈ క్రిటికల్ కేర్ సెంటర్లను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాపాయంలో ఉన్న రోగులకు తక్షణమే అత్యున్నత స్థాయి అత్యవసర వైద్యం అందించడానికి ఈ క్రిటికల్ కేర్ సెంటర్లు ప్రారంభించడం ఒక శుభపరిణామమని తెలిపారు. ఒంగోలులో ప్రారంభించిన ఈ కేంద్రం మరో రెండు వారాల్లో ప్రజలకు పూర్తిస్థాయి వినియోగంలోకి వస్తుందని స్పష్టం చేశారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అన్ని సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ఈ సెంటర్ పేద ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా మారనుందన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదలకు మెరుగైన వైద్యం అందించడంపైనే ప్రధానంగా దృష్టి సారించారని, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఆపదలో ఉన్న అనేక పేద కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు.
వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన కూటమి ప్రభుత్వం, ఎన్టీఆర్ వైద్య సేవ మరియు సంజీవని పథకాల ద్వారా ప్రజల ఆరోగ్యానికి పూర్తి భద్రత కల్పిస్తోందన్నారు. అత్యవసర ఔషధాలు మరియు వైద్య సరఫరాల కోసం డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తూ వైద్య రంగంలో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టామన్నారు.
గర్భిణులు, బాలింతల కోసం ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ ద్వారా మెరుగైన రవాణా సేవలు అందిస్తున్నామని తెలిపారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా కొండేపి మరియు అద్దంకి ప్రాంతాలలో నూతనంగా డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేశామని వెల్లడించారు.
అదేవిధంగా ఆసుపత్రి వైద్యాధికారులు మరియు ఇంజనీరింగ్ విభాగం అందించిన సాంకేతిక వివరాలను మంత్రి గారు తెలియజేస్తూ, పీఎం-ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 60:40 కేంద్ర-రాష్ట్ర నిధుల భాగస్వామ్యంతో రూ. 23.75 కోట్ల వ్యయంతో (భవన నిర్మాణం రూ. 16.63 కోట్లు, పరికరాల నిమిత్తం రూ. 7.12 కోట్లు) ఈ 4 అంతస్తుల (G+3) సముదాయాన్ని 34,906 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించినట్లు వివరించారు.
ఇందులో 18 పడకల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU), 16 పడకల ఐసోలేషన్ వార్డులు, 10 పడకల ఎమర్జెన్సీ వార్డు, డయాలసిస్, పోస్ట్ ఓపి మరియు మదర్-చైల్డ్ కేర్ పడకలతో సహా మొత్తం 50 పడకలు, 1 ట్రయేజ్ విభాగం ఏర్పాటు చేశామన్నారు. 2 అధునాతన ఆపరేషన్ థియేటర్లు, 2 లేబర్ డెలివరీ రూమ్‌లు, ఎక్స్-రే, అల్ట్రాసౌండ్ గదులు మరియు 20 మంది సామర్థ్యం కలిగిన 2 లిఫ్ట్‌లను ఈ భవనంలో అమర్చినట్లు వెల్లడించారు.
ఒంగోలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (GGH)లో రోజువారీ రోగుల తాకిడి నిరంతరం పెరుగుతోందని మంత్రి తెలిపారు. 500 పడకల ఆసుపత్రి అయినప్పటికీ ప్రస్తుతం 700 మందికి పైగా ఇన్‌పేషెంట్లు, రోజుకు దాదాపు 1,600 మంది అవుట్‌పేషెంట్లు చికిత్స పొందుతున్నారన్నారు. రోగుల రద్దీని క్రమబద్ధీకరించడానికి ABDM ‘స్కాన్ & షేర్’ విధానం ద్వారా ఓపి వేచి ఉండే సమయాన్ని తగ్గించామని, మహిళా రోగులకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల వైద్యశాలకు వచ్చే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పారు. రోగులకు నాణ్యమైన చికిత్స అందించేందుకు ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ (Cath Lab), శ్వాసకోశ వ్యాధుల నివారణకు రూ. 15 లక్షల వ్యయంతో పల్మనాలజీ TFT పరికరం, రూ. 2 కోట్ల వ్యయంతో యూరాలజీ అత్యాధునిక డిజిటల్ యంత్రాలు, ఈఎన్టీ సౌండ్ ప్రూఫ్ ఆడియోమెట్రీ రూమ్, నవజాత శిశు సంరక్షణ కోసం కంగారూ మదర్ కేర్ (KMC) సేవలను సమకూర్చామని ఆయన వివరించారు.
అలాగే పారదర్శకత కోసం డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.
ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధనరావు మాట్లాడుతూ, రూ. 23.75 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం కావడం ఒంగోలు ప్రజలకు దక్కిన గొప్ప వరమని కొనియాడారు. భవనాన్ని నాణ్యతతో వేగంగా నిర్మించిన కాంట్రాక్టర్ సంస్థ ‘మాస్టర్స్ కన్స్ట్రక్షన్స్’ ప్రతినిధులను ఆయన అభినందించారు. త్వరలోనే జిజిహెచ్ ప్రాంగణంలోని ‘గోపీ బ్లాక్’ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తామని స్పష్టం చేశారు.
కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా నిర్మించిన ఈ ఆధునిక క్రిటికల్ కేర్ సెంటర్ ద్వారా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ త్వరితగతిన ఉచిత అత్యవసర వైద్య సేవలు లభించనున్నాయి.
ఈ కార్యక్రమంలో అధికారులు, డాక్టర్స్, రిమ్స్ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


