అబ్దుల్ అజీజ్‌పై రాజకీయ కక్షతో చేస్తున్న ఆరోపణలను నెల్లూరు ప్రజలు నమ్మరని టీడీపీ మైనారిటీ నేతలు పేర్కొన్నారు. నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మొయినుద్దీన్, జిల్లా అధికార ప్రతినిధి సాబీర్ ఖాన్, రాష్ట్ర మైనారిటీ నాయకుడు హయాత్ బాబా మీడియాతో మాట్లాడారు.
14 ఏళ్ల ప్రజాజీవితంలో అబ్దుల్ అజీజ్‌పై ఒక్క అవినీతి మచ్చ కూడా చూపించలేని వారు ఇప్పుడు వ్యాపార రుణాన్ని రాజకీయ లావాదేవీగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. అజీజ్‌కు సంబంధించిన ₹44 కోట్ల వ్యవహారం ఎన్నికల సమయంలో వచ్చిన రాజకీయ డబ్బు కాదని, ఎన్నికల అనంతరం రాతపూర్వక ఒప్పందాలు, భద్రత, వడ్డీతో జరిగిన వ్యాపార రుణ లావాదేవీ అని నేతలు వివరించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వ్యాఖ్యలను కూడా వక్రీకరిస్తున్నారని ఆరోపించారు.
మేయర్‌గా నెల్లూరు నగరాభివృద్ధికి అజీజ్ కృషి చేశారని, ప్రస్తుతం వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ‘తాలీమ్-ఎ-హునర్’ వంటి విద్యా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. రాజకీయ విమర్శల పేరుతో జమాత్‌లను, మత పెద్దలను, ముస్లిం సమాజాన్ని కించపరచడం తగదన్నారు. “అబ్దుల్ అజీజ్‌పై బురదజల్లడం సూర్యుడిపై ఉమ్మేసినట్టే” అని వ్యాఖ్యానించారు. రాజకీయ ఆరోపణలు ఆధారాలతో చేయాలని, అబద్ధాలతో అజీజ్ ప్రజాజీవిత చరిత్రను చెరపలేరని స్పష్టం చేశారు.






