కర్నూలు: మెగా DSC ద్వారా ఎంపికైన అభ్యర్థుల సమస్యలు, వారి హక్కులు మరియు ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా కర్నూలులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా “ఇది మా కష్టం.. మా ప్రతిభ..! అవమానిస్తే ఊరుకోం..!” అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ అభ్యర్థులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి చదివి, పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి మెగా DSCలో ఎంపికైన అభ్యర్థుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, వారికి న్యాయం చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు కోరారు. ఉద్యోగం కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల ప్రతిభకు, కష్టానికి, ఆత్మగౌరవానికి తగిన గౌరవం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమానికి ZPHS పులికొండ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది B. పార్థసారథి, D. బాల సిద్ధయ్య, కొలిమి గౌస్, గురుమూర్తి సూర్య పాల్గొని మెగా DSC సెలక్షన్ అభ్యర్థులకు తమ సంఘీభావాన్ని తెలిపారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, న్యాయం సాధించే వరకు ఐక్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అభ్యర్థుల ఆత్మగౌరవం, ప్రతిభ, భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

