తెలంగాణ రైతాంగ పోరాట వారసులు కమ్యూనిస్టులే!
చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు
– సీపీఎం యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా
యాచారం, సెప్టెంబర్ 10: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి, వారోత్సవాలను పురస్కరించుకుని సీపీఎం యాచారం మండల కమిటీ ఆధ్వర్యంలో యాచారం మండల కేంద్రంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీపీఎం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ రైతాంగం సాగించిన పోరాటం చారిత్రాత్మకమన్నారు. దొడ్డి కొమురయ్య, చిట్యాల ఐలమ్మతో పాటు పలువురు పోరాట యోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ పోరాటం ద్వారా వేలాది మంది ప్రాణత్యాగం చేశారని, లక్షల ఎకరాల భూమి పేదలకు దక్కిందని పేర్కొన్నారు.
రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని నర్సింహా విమర్శించారు. మతపరమైన రాజకీయాలకు చరిత్రను ఉపయోగించుకోవడం సరికాదన్నారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై సీపీఎం నిరంతరం ఉద్యమిస్తుందని, యాచారం మండలంలోని స్థానిక సమస్యలపై భవిష్యత్తులో ఆందోళనలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు, మండల కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




