శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు వెంటనే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాధం డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తాత మధుపై విమర్శలు చేశారు.
నిన్న రాష్ట్ర శాసనసభ సమావేశానికి హాజరయ్యే క్రమంలో ఏర్పడిన తోపులాట, ఘర్షణ సమయంలో తాత మధు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో శాసనసభ గౌరవ స్పీకర్ స్థానంలో ఉన్న దళిత నేత గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి అసభ్యకర పదజాలంతో దూషించినట్లు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చిందని రామనాధం తెలిపారు.
ఇక ఎలాంటి రుజువులు అవసరం లేదని, నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలకు తాత మధు సహకరించాలని సూచించారు. రాజకీయాలను పక్కనపెట్టి తన ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయడమే మంచిదని డాక్టర్ వాసిరెడ్డి రామనాధం హితవు పలికారు.



