తిరుపతి కలెక్టరేట్, సెప్టెంబర్ 7 పున్నమి ప్రతినిధి
తిరుపతి జిల్లాలో రీ-సర్వే, ఈ-కేవైసీ, కోర్టు కేసులు, సివిల్ సప్లైస్ సేవలను నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు తహశీల్దార్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి డీఆర్వో జి. నరసింహులుతో కలిసి తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివిధ మండలాల్లోని పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, రీ-సర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, ఈ-కేవైసీ ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు. కోర్టు కేసులు, ఎస్ఐఆర్ పెండింగ్ అంశాలను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. తిరుపతి రూరల్, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు జరిగే రైస్ కార్డుల పంపిణీలో లబ్ధిదారులందరి ఈ-కేవైసీ పూర్తి చేయడంతో పాటు మరణించిన వారి పేర్లను తొలగించాలని సూచించారు. రీ-సర్వేలో ఫేజ్-6 గ్రౌండ్ ట్రూతింగ్తో పాటు వెక్టోరైజేషన్, సంబంధిత లాగిన్ ప్రక్రియలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఓజిలి, దొరవారిసత్రం, వడమాలపేట, పెళ్లకూరు, ఎర్రవారిపాలెం తదితర మండలాల్లో పెండింగ్లో ఉన్న ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పిజిఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని జేసీ హెచ్చరించారు. భూ వివాదాలు, ఆక్రమణలు, శ్మశాన వాటికలకు దారులు, సరిహద్దు సమస్యలపై ఇరుపక్షాలను విచారించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదుదారుల వాదనలు స్వయంగా విని, విచారణ అనంతరం స్పష్టమైన రాతపూర్వక ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
డీఆర్వో జి. నరసింహులు మాట్లాడుతూ, కంటెంప్ట్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు అధికారులు సమయపాలనతో పనిచేయాలని సూచించారు. కోర్టు ఆదేశాలు, నోటీసులను సంబంధిత పిటిషనర్లకు నిబంధనల ప్రకారం అందజేసి, ఆర్పిఏడి రశీదులు, పోస్టల్ ట్రాకింగ్ వివరాలను సంబంధిత ఫైళ్లలో భద్రపరచాలని ఆదేశించారు. కేసుల వివరాలను త్వరితగతిన పరిశీలించి ఆన్లైన్లో అప్డేట్ చేయాలని తెలిపారు. ఈ సమీక్షలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామాంజనమ్మ, ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.



