కనపడలేదా? వినపడలేదా?
స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగుల ఆత్మఘోష ర్యాలీ
కడప, సెప్టెంబర్ 7 (పున్నమి ప్రతినిధి):
తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సోమవారం కడప నగరంలో “ఆత్మఘోష ర్యాలీ” నిర్వహించారు. మహావీర్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నినాదాలతో కలెక్టరేట్ వరకు కొనసాగింది. అనంతరం ఉద్యోగులు క్యాండిళ్లు పట్టుకొని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల కడప జిల్లా ప్రెసిడెంట్ వరప్రసాద్, జనరల్ సెక్రటరీ నాగార్జున, వర్కింగ్ ప్రెసిడెంట్ శివ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు ఎన్నో రోజులుగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ పరిష్కారం లభించకపోవడంతో ఆత్మఘోష ర్యాలీ చేపట్టాల్సి వచ్చిందన్నారు.
ప్రధాన డిమాండ్లు
– ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు వెంటనే మంజూరు చేయాలి.
– AASను తక్షణమే అమలు చేయాలి.
– ప్రొబేషన్ ఆలస్యమైన కాలానికి సంబంధించిన ఎరియర్స్ వెంటనే మంజూరు చేయాలి.
– ప్రతి ఉద్యోగికి కనీస మూల వేతనం రూ.30,000లకు తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
– ఉద్యోగులకు సరైన ప్రమోషన్ ఛానల్ కల్పించాలి.
– GO MS No.11ను వెంటనే రద్దు చేయాలి.
– మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రావాల్సిన అన్ని ప్రయోజనాలను మూడు నెలల్లోపు అందించాలి.
– మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన ఒక్కరికి కారుణ్య నియామకం ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి.
– జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో SG SW ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి.
ఈ సందర్భంగా జనరల్ సెక్రటరీ నాగార్జున మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో ప్రభుత్వం జరపబోయే చర్చలను సఫలీకృతం చేసి, ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ ఆత్మఘోష ర్యాలీలో వైఎస్సార్ కడప జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన SGSW ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు.



