ఖాళీ కుర్చీలకే వినతిపత్రం ఇచ్చిన ప్రజాప్రతినిధులు
కూసుమంచి, ఆగస్టు 31:
కూసుమంచి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టింది. ప్రజల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందేందుకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సంబంధిత అధికారులు హాజరుకాకపోవడంతో ప్రజాప్రతినిధులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
గ్రామంలోని వివిధ సమస్యలపై వినతిపత్రం అందించేందుకు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజాప్రతినిధులకు అధికారులు అందుబాటులో లేకపోవడంతో తమ సమస్యలను ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది. చివరకు అధికారులు కూర్చోవాల్సిన ఖాళీ కుర్చీలకే వినతిపత్రాలు అందించి వెనుదిరగాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఈ సందర్భంగా TWMF ఖమ్మం జిల్లా ఇన్చార్జి గుండా ఉపేందర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు గైర్హాజరు కావడం బాధాకరమన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఆశలతో ప్రజావాణికి వస్తారని, అలాంటి కార్యక్రమంలో అధికారులు అందుబాటులో లేకపోవడం ప్రజల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
ప్రజావాణి కార్యక్రమాలు కేవలం పేరుకే కాకుండా ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే వేదికగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ఇకపై అధికారులు తప్పనిసరిగా ప్రజావాణికి హాజరై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజల సమస్యలు వినేందుకు అధికారులు లేకపోతే ప్రజావాణి నిర్వహణకు అర్థమేంటి? అని గుండా ఉపేందర్ ప్రశ్నించారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.


