పెనగలూరు: పెనగలూరు మండలంలోని పెద్ద చెరువు తెగిన కట్టను ప్రభుత్వం తక్షణమే మరమ్మతు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ నాయకులు సీహెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. గురువారం చెరువు కట్టను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఐదేళ్ల క్రితం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిన సమయంలో వచ్చిన వరదలకు చెరువు కట్ట తెగిపోయిందన్నారు. అప్పటి నుంచి 1400 ఎకరాల ఆయకట్టులో సాగు నిలిచిపోయి రైతులు నష్టపోతున్నారని తెలిపారు. గత ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా కట్ట మరమ్మతులు చేపట్టకపోవడం దారుణమన్నారు. చెరువులో నీరు వదిలే గేట్లు, తూములు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయని చెప్పారు. కట్టపై రాకపోకలు సాగించే 10 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చెరువులో నీరు నిల్వ లేకపోవడంతో ఆక్రమణలు పెరుగుతున్నాయని ఆరోపించారు. కట్ట మరమ్మతులకు ఇరిగేషన్ అధికారులు రూ.8 కోట్ల అంచనాలు సిద్ధం చేసి ఉన్నతాధికారుల వద్దకు పంపినా ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదన్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం కొనసాగితే రైతులను సమీకరించి పోరాటాలు చేపడతామని చంద్రశేఖర్ హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు ఎన్.జయరామయ్య నాయుడు, కే.కృష్ణయ్య, సిరివరం పెద్ద నరసింహులు, ఏ.కృష్ణమ నాయుడు, దామా సుబ్బరాయుడు, కలివేల రామయ్య, గండ్ర ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.






